Last Updated:

Kurnool Mayor: కర్నూలు కార్పొరేషన్‌లో కలకలం.. మేయర్ పీఠం కదులుతుందా?

Kurnool Mayor: కర్నూలు కార్పొరేషన్‌లో కలకలం.. మేయర్ పీఠం కదులుతుందా?

TDP Focus On Kurnool Mayor Seat: కర్నూలు నగర మేయర్‌ని పదవి నుంచి తప్పించడానికి సొంత పార్టీ నేతలు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన నేతలు ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికలను ఏకపక్షం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అలా ఎన్నికైన మేయర్ తన పదవిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించారని టీడీపీ నాయకులు ఆరోపణలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారాక వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరుతున్నారు.. దాంతో పేట మేయర్ పీఠం కదలుతుందన్న చర్చ మొదలైంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 52 కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో వైసీపీ నుంచి 43 మంది… టీడీపీ నుంచి 6మంది.. ముగ్గురు స్వతంత్రంగా గెలిచారు. 19వ డివిజన్ కార్పొరేటర్ ఆయన బీవై రామయ్య నగర మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. రామయ్య మేయర్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పై టీడీపీ కార్పొరేటర్లు, సొంత పార్టీ వైసీపీ కార్పొరేటర్లు కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. మేయర్ తనకు అనుకూలంగా ఉన్న వారి డివిజన్లలో మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించారన్న ఆరోపణలున్నాయి.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్నూలు కార్పొరేషన్‌లో లెక్కలు మారిపోయాయి. కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు,కర్నూలు ఎంపీ కార్పొరేషన్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 11మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కాపుకున్నారు. దీంతో కౌన్సిల్ లో టీడీపీ బలం 24కి పెరిగింది. అయితే రామయ్యను మేయర్ పదవి నుంచి దింపడానికి 28మంది సభ్యుల మద్దతు కావాలి.. అంటే టీడీపీకి ఇంకా నలుగురు సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా జిల్లా టీడీపీ పెద్దలు వ్యూహాలు పన్నుతున్నారని సమాచారం.

 

కాగా, ఇప్పటికే మరో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీకి టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు మేయర్‌పై అవినీతి ఆరోపణలు మొదలు పెట్టారు. మేయర్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీ అవినీతికి పాల్పడ్డారని, ఆయనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులను గమనిస్తున్న వైసీపీ నేతలు తమ పార్టీ కార్పొరేటర్లతో మంతనాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. మరోవైపు కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి బుజ్జగింపు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. ఇంకా ఏడాది కాలం పాటు పదవిలో కొనసాగడానికి అవకాశాలు ఉన్న టీడీపీ మాత్రం వైసీపీని గద్దె దించాలని వ్యూహాలు పన్నుతూ త్వరలోనే మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తనకు కావాల్సిన బలాన్ని సమకూర్చుకుంటుంది. అయితే రానున్న కాలంలో కర్నూలు కార్పొరేషన్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి మరి.