Nara Lokesh: తగ్గేదేలే.. సినిమా చూపిస్తా.. త్వరలోనే రెడ్‌బుక్ మూడో చాప్టర్!
Nara Lokesh America Tour Unveils NTR Statue Atlanta: రెడ్‌బుక్ విషయంలో తగ్గేదేలే అని, చట్టాన్ని ఉల్లఘించి పార్టీ క్యాడర్‌ను ఇబ్బందులకు గురిచేసిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్.. అట్లాంటాలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, త్వరలోనే రెడ్‌బుక్ మూడో చాప్టర్ తెరుస్తున్నామని ప్రకటించారు. యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, చేయని తప్పునకు 53 రోజులు జైలు శిక్ష అనుభవించిన సీఎం చంద్రబాబుకు బాధ ఉండదా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మూడో చాప్టర్ తెరుస్తామన్నారు.
రెడ్‌బుక్ అంటేనే వైసీసీ అధినేత జగన్ భయపడిపోతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. అయితే జగన్.. గుడ్‌బుక్ తీసుకొస్తానని అంటున్నారని, కానీ అందులో ఏం రాయాలో కూడ అర్థం కావడం లేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే.. గత ప్రభుత్వం వైసీపీ అండదండలతో లుకౌట్ నోటీసులు ఇచ్చారని, కానీ ఎలాంటి నోటీసులకు బయపడకుండా ఎన్ఆర్ఐలు అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు. అయితే మీరంతా ఎన్ఆర్ఐలు కాదని, ఎంఆర్ఐలు అని పిలుస్తానని వెల్లడించారు. ఎంఆర్ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ అని వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చేందుకు ప్రతి తెలుగువారి కృషి ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు.