CM Chandrababu: లోకేశ్ కృషితోనే విశాఖలో గూగుల్ కంపెనీ సాధ్యమైంది.. సీఎం చంద్రబాబు వెల్లడి
CM Chandrababu Holds Conference With District Collectors: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047, నేతన పాలసీలు, భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సచివాలయంలో రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్నారు.
ప్రతి సంక్షోభంతో అవకాశాలు ఉంటాయన్నారు. ఇలాంటి సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని వెల్లడించారు. అనంతరం నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు. ఈ సమావేశం రెండు రోజుల పాటు కొనసాగనుంది.
ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని చెప్పారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు వస్తాయన్నారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరిందన్నారు. లోకేశ్ కృషితో గూగుల్ ఏర్పాటు, గూగుల్‌తో ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి చెందిందన్నారు.
ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుందని చంద్రబాబు అన్నారు. ఓటే దేశాన్ని కాపాడుతుందని చెప్పారు. విధ్వంస పాలన తర్వాత రాష్ట్రంలో పునర్నిర్మాణం జరుగుతోందని, ఏపీలో అభివృద్ధికి ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ అవసరమన్నారు. ఒక్కోసారి హార్డ్ వర్క్ కాదు.. ఎంత స్మార్ట్ వర్క్ చేశామన్నదే ముఖ్యమన్నారు.
గత పాలకులు రాష్ట్రాన్ని నాశనం చేశారని, వైసీపీ పాలనలో భూకబ్జాలు రాజ్యమేలాయని వెల్లడించారు. జగన్ పాలనలో మద్యం మాఫియా విచ్చలవిడిగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో గంజాయి పెద్ద సమస్యగా మారిందని, గాడి తప్పిన పాలనను ఇప్పుడే గాడిలో పెడుతున్నామన్నారు. వైసీపీ పాలనలో పోర్టులను కబ్జా చేశారని, రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియాగా మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పులను సరిచేస్తున్నామన్నారు. అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమన్నారు.
ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి శాఖలోనూ అప్పులు పెట్టి వెళ్లారని వివరించారు. కలెక్టర్లు సరిగా ఉంటే తప్పా వ్యవస్థను గాడిలో పెట్టలేమని చెప్పారు. అంతకుముందు సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గూగుల్‌తో పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది. ఇందులో భాగంగానే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు ముందు సీఎం చంద్రబాబు నివాసంలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.