International Nurses Day 2025: నర్సులను సత్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

AP Deputy CM Pawan Kalyan appreciate Nurse on International Nurses Day 2025: గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా స్టాఫ్ నర్సులతో సమావేశం అయి వారిని సత్కరించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రశంసనీయ సేవలు అందించిన ఎనిమిదిమంది స్టాఫ్ నర్సులను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్పూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా చేస్తున్నారని అన్నారు.
విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరచిపోరని కొనియాడారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు విధులు నిర్వర్తించిన విధానం మరువలేమన్నారు. ఇటీవల సింగపూర్లో తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు… ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి మీ కష్టం గుర్తుకువచ్చిందని పవన్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరిని కలిసే అవకాశం రావడం సంతోషాన్నిచ్చిందన్నారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తానని పవన్ హామీ ఇచ్చారు.