YS Jagan: గుంటూరుకు మాజీ సీఎం జగన్.. అనుమతి లేదంటున్న మిర్చి యార్డు అధికారులు

YS Jagan Guntur Tour To Support Mirchi Farmers: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు బయలుదేరారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డుకు వాహనంలో బయలుదేరారు. మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున జగన్ టూరుకు అనుమతి లేదని మిర్చి యార్డు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధం అంటూ మైక్‌లో అధికారులు అనౌన్స్మెంట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టబద్ధంగా ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, మిర్చి యార్డుకు జగన్ వస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. మిర్చి యార్డులో ఎలాంటి సభా సమావేశాలు నిర్వహించడం లేదని, కేవలం మిర్చి రైతులతో జగన్ మాట్లాడుతారంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఒకవైపు అనుమతి తీసుకోకపోవడం.. మరోవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో జగన్ పర్యటనకు దూరంగా ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. కాగా, కాసేపట్లో జగన్ మిర్చి యార్డుకు చేరుకోనున్నారు.
వైఎస్ జగన్ పర్యటనతో రహదారిపై వైసీపీ నేతల వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేశారు. దీంతో రోడ్డుపైనే మిర్చిలోడు లారీలు, వ్యాన్లు ఆగిపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, వైసీపీ అధినేత జగన్ గుంటూరు యార్డు చేరుకున్నారు. ఈ మేరకు మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. అనంతరం రైతుల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతకుముందు వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు మిర్చి యార్డు వద్ద పోలీసుల భద్రతపై వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ మిర్చి యార్డు వద్ద పోలీసులు కనిపించడం లేదని, కావాలనే భద్రతా సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. కానీ, పర్యటనకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు.