CM Chandrababu: మిర్చి రైతు పూచీ మీదే.. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం లేఖ

AP CM Chandrababu Letter To Central Govt for Mirchi Famers: ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మిర్చి ధరలు విపరీతంగా పడిపోవటంతో కుదలైన మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ బుధవారం ఆయన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. మిర్చి రైతుల పరిస్థితి, మార్కెట్‌లో ధరల పతనంపై ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందాయని ఆయన గుర్తుచేశారు.
సగం కూడా వచ్చేలా లేదు
సాగు వ్యయానికి, విక్రయధరకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. వెంటనే కేంద్రం రంగంలోకి దిగి మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు, కర్నూలు, నంద్యాల ఇలా ఎక్కడ చూసినా మిర్చి రైతులు కుదేలయ్యారని, పెట్టుబడి ఖర్చు ఎకరాకు లక్షకు మించగా, దిగుబడి తగ్గిపోవటం, ధరల పతనంతో పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వచ్చే అవకాశం కనపించటం లేదని సీఎం తన లేఖలో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈ సమయంలో 50 శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టాన్ని కేంద్రం భరించాలని పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి, ధరలపై వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రికి పంపించారు.
ధరల పతనమే కారణం
ఈ యేడాది మిర్చి విస్తీర్ణం పెరిగి ఉత్పత్తి కూడా అధికంగా ఉండటంతో డిమాండ్ తగ్గిందని సీఎం తెలిపారు. గతంలో ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాలు రూ.20వేల ఉండగా, నేడు ఆ ధర రూ.13వేలకు పడిపోయిందని, సాధారణ రకం మిర్చి క్వింటాలుకు రూ.11వేలు పడిపోయిందని వివరించారు. సాగు కోసం రూ.లక్షల పెట్టుబడి పెట్టి, ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని వచ్చిన అరకొర దిగుబడిని అమ్మజూపితే కొన్ని ప్రాంతాలలో పదో వంతు పెట్టుబడి రాని సంగతిని ఆయన లేఖలో ప్రస్తావించారు. పలు దేశాలకు ఎగుమతి తగ్గడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించారు.
గతంలోనూ వినతి
మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు రెండు సార్లు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రితో మాట్లాడారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ డిసెంబర్ 26, ఫిబ్రవరి 5,11 తేదీల్లో కేంద్రానికి లేఖలు కూడా రాశారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని తదితరులు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రంతో పలు మార్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో మిర్చి రైతులకు సాయం చేయాలని కోరుతూ మరోసారి ఏపీ ప్రభుత్వం తరపున ఓ బృందం కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది..
ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచుతాం
ఏపీలో ఉన్నత విద్యను మరింత ప్రమాణీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలోని పలు వర్సీటీలకు ప్రతిభ ఆధారంగా వైస్ ఛాన్సలర్లను నియమించామని ఆయన తెలిపారు. భావి పౌరులను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తమ ప్రభుత్వం ప్రతిభ, సామాజిక న్యాయం వంటి అంశాల ప్రాతిపదికన వీసీలను నియమించిందన్నారు. మొదటిసారిగా ఎస్టీ మహిళ ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లందరినీ సీఎం అభినందించారు. విద్య, విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వారి పదవీకాలం విజయవంతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.
ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమం వాయిదా
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీ ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల కార్యక్రమం వాయిదా పడింది. దీంతో ఈ కార్యక్రమాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి ఏపీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. తొలుత ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా వాయిదా వేశారు.