Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబుకు మళ్ళీ షాక్.. బెయిల్, కస్టడీ పిటిషన్ లపై విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
Nara Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కాగా ఒకవైపు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు.. మరోవైపు కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా నేడు ఈ పిటిషన్లపై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
అయితే చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏ పిటిషన్ పై విచారణ జరపాలనే దానిపై చంద్రబాబు లాయర్లు, సీఐడీ తరపు లాయర్ల మధ్య వాదోపవాదనలు జరిగాయి. కస్టడీ పిటిషన్ కంటే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. ఈ నెల 14వ తేదీన చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను వేశారని.. అలానే ఇప్పటికే రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ కస్టడీకి తీసుకుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. సీఐడీ కస్టడీ అవసరం లేదని కోరారు.
మరోవైపు కేసు విచారణకు చంద్రబాబు సహకరించడం లేదని, మరో 5 రోజుల పాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును సీఐడీ కోరింది. దాంతో అయితే ఈ సమయంలో ఏ పిటిషన్ పై విచారణ జరపాలో తమకు తెలుసునని.. చంద్రబాబు తరపు లాయర్లకు ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. కస్టడీ పిటిషన్ పై సీఐడీ మెమో దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామని చెప్పింది. రేపు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత… రెండింటిపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామని తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై దేన్ని ముందు విచారించాలో రేపు నిర్ణయిస్తామని వెల్లడించింది. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను రేపు ప్రస్తావించడానికి సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.