Last Updated:

Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందు దొందే.. 6 అబద్ధాలు 66 మోసాలతో కాంగ్రెస్ పాలన

Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ దొందు దొందే.. 6 అబద్ధాలు 66 మోసాలతో కాంగ్రెస్ పాలన

Kishan Reddy says BJP Charge Sheet on Congress Failures: అసమర్థతలో, అసత్యాల ప్రచారంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్‌ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని సోమాజిగూడలో బీజేపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనపై ‘గ్యారెంటీల గారడీ.. 6 అబద్ధాలు 66 మోసాలు’ అనే పేరుతో చార్జిషీట్ విడుదల చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఏ ఒక్క హామీనీ నేరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు దేనికి చేసుకుంటుందో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేరని విమర్శించారు.

హామీల అమలులో వైఫల్యం
తాము అధికారంలోకి వచ్చిన వంద రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నిరుటి డిసెంబరు 9న స్వయంగా సోనియా గాంధీ కరపత్రం విడుదల చేసి మరీ నాడు ప్రకటించారని, వాటిలో ఏడాదైనా ఒక్కటీ అమలు కాలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. హామీలు అమలు కాకుండానే విజయోత్సవాలు దేనికంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలను విజయోత్సవాలకు వాడి, సొంత డబ్బా కొట్టుకోవటం మీద ఆయన మండిపడ్డారు. మిగతా పార్టీల్లా తాము బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం లేదని, ఏడాది పాలన చూశాకే వారి వైఫల్యాలను ప్రశ్నిస్తున్నామన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు అర్థమయ్యే లా చెప్పేందుకే తెలంగాణ ప్రజల పక్షాన చార్జిషీట్ రూపంలో విడుదల చేస్తున్నామన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే..
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్, ఏడాది కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడాలేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్‌తో సమానంగా సీట్ల వచ్చాయని, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత తమపై ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై విమర్శలు చేయాలంటే రెండు రోజుల సమయం కూడా చాలదన్నారు. రుణమాఫీ, రైతు భరోసా అమలు కాలేదని, పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు వరికి మాత్రమే ఇవ్వడం ఏంటని నిలదీశారు.

ఆటగాళ్లే మారారు..
తెలంగాణలో పాలకులే కానీ పాలన, ప్రజల బతుకులు మారలేదని కిషన్ రెడ్డి వివరించారు. బీఆర్‌ఎస్ కాళేశ్వరంతో లక్ష కోట్ల దోపిడీ చేయగా, కాంగ్రెస్ మూసీ పేరుతో లక్షన్నర కోట్లకు ఎసరు పెట్టిందని ఆరోపించింది. గత పదేళ్లలో కే-ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ.. గతంలో 12 మంది ఎమ్మెల్యేలను గులాబీపార్టీ గుంజుకోగా, ఇప్పుడు కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకుందని మండిపడ్డారు. ధరణితో 10 లక్షల ఎకరాల రైతుల భూములను బీఆర్ఎస్ మాయం చేయగా, హైడ్రా, ఫోర్త్ సిటీతో కాంగ్రెస్ లక్షల ఇళ్ల కూల్చివేతలకు సిద్ధమైందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ పదేళ్లలో దివాలా తీయించగా, ఆయన బాటలోనే కాంగ్రెస్ ఏడాదిలో రూ. 80 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఆడబిల్లలకు వడ్డీలేని రుణాలని చెప్పిన బీఆర్ఎస్ మోసం చేయగా, స్కూటీ, తులం బంగారం అంటూ కాంగ్రెస్ ధోకా చేసిందన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం ఎక్కడ అని నిలదీశారు.

సీఎం సవాలుకు రెడీ..
మహబూబ్ నగర్ జిల్లాల్లోని అమిస్తాపూర్ సభలో ఎన్నికల హామీలపై సీఎం విసిరిన సవాలును తాను స్వీకరిస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, సీఎం హోదాలో ఉన్న రేవంత్ తన భాషను మార్చుకుంటేనే చర్చకు వస్తానని తేల్చిచెప్పారు.