PM Modi France Tour: ఫ్రాన్స్ లోనూ యూపీఐ సేవలు.. ప్రధాని మోదీకి ఫ్రెంచ్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం
మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం "గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్"ను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.
PM Modi France Tour: భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజులు ఫ్రాన్స్ దేశంలో పర్యటిస్తున్నారు. కాగా శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌తో కలిసి ప్రధాన అతిథిగా పాల్గొననున్న మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్”ను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.
గురువారం రాత్రి డిన్నర్ కు ముందు మోదీకి ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ సాదర స్వాగతం పలికారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన నిమిత్తం పారిస్ చేరిన మోదీకి రెడ్ కార్పెట్ ద్వారా స్వాగతం పలికారు ఫ్రెంచ్ అధ్యక్షుడు. భారత ప్రజల తరపున మాకిచ్చిన ఈ ఏకైక గౌరవానికి ప్రెసిడెంట్ మాక్రాన్‌కు ధన్యవాదాలని భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షురాలు, ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ ఎలీసీ ప్యాలెస్‌లో మోదీకి ప్రైవేట్ విందు ఇచ్చారు.
తాను చాలాసార్లు ఫ్రాన్స్ దేశానికి వచ్చానని, కానీ ఈసారి ఇది చాలా ప్రత్యేకమైనదని, భారతదేశం, ఫ్రాన్స్ దేశాల మధ్య సత్సంబంధాల బలాన్ని మోదీ కొనియాడారు. భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ప్రజల మధ్య అనుసంధానం కీలక పునాదిగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని డయాస్పోరా సభ్యులను మోదీ కోరారు.
ఫ్రాన్స్ లో యూపీఐ సేవలు(PM Modi France Tour)
ఇక ఇంతేకాకుండా ఈ ఇరుదేశాల మధ్య సత్సంబంధాల నేపథ్యంలో మన దేశంలో విజయవంతమైన తక్షణ చెల్లింపుల విధానం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) సేవలను ఫ్రాన్స్‌లో కూడా వినియోగించుకునే అవకాశం లభించింది. భారతీయ పర్యాటకులు భారతీయ కరెన్సీ రూపాయితో తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫ్రాన్స్‌లో చెల్లింపులు జరపడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. మరోవైపు ఫ్రాన్స్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థినీ, విద్యార్థులకు విద్యాభ్యాసం అనంతరం అక్కడే ఐదేళ్లపాటు పనిచేసే అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాల జారీకి కూడా ఒప్పందం కుదిరింది. అలాగే ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారంతో మర్సీల్లేలో కొత్తగా భారతీయ కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలని భారతదేశం నిర్ణయించిందని ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ వెల్లడించారు.