Meghalaya honeymoon case: పెళ్లైన 4 రోజులకే భర్తను కడతేర్చిన భార్య.!

Honeymoon murder case: మేఘాలయలో ఇండోర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యమవ్వగా.. భార్యే తన భర్తను చంపించినట్లు తేలింది. హనీమూన్ కోసమని చెప్పి తీసుకెళ్లిమరీ భార్య చంపించింది . ఈ హత్య కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనమ్ తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
వివరాల్లోకి వెలితే… సోనమ్ అనే యువతిని రాజా రఘువంశీని వివాహం చేసుకున్నాడు. అయితే సోనమ్ కు రాజ్ కుష్వార్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. పెద్దలను ఎదిరించలేక వారు చూసిన సంబంధాన్ని చేసుకుంది సోనమ్. అయితే తన భర్తను చంపి ఆతర్వాత ప్రియుడితో వెళ్లిపోవాలనుకుంది సోనమ్. పెళ్లైనా నాలుగు రోజులకే హనీమూన్ ప్లాన్ చేసింది. అక్కడ అతన్ని చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అందుకు ప్రియుడు కిరాయి హంతకులను చేర్చుకున్నాడు. దీంతో మేఘాలయాకు వెళ్లారు నవదంపతులు. అక్కడే నిర్జన ప్రదేశానికి రాజా రఘువంశీని సోనమ్ తీసుకెళ్లడంతో అక్కడే పొంచి ఉన్న ఆమె ప్రియుడు, కిరాయి హంతకులు కలిసి రాజా రఘువంశీని హత్య చేశారు. ఆతర్వాత వాళ్లతోనే సోనమ్ వెళ్లిపోయింది.
ఇండోర్ పర్యాటకుడు రాజా రఘువంశీని మేఘాలయలో హనీమూన్ సందర్భంగా అతని భార్య అయిన సోనమ్ నియమించిన వ్యక్తులు హత్య చేశారని డిజిపి ఇదాషిషా నోంగ్‌రాంగ్ సోమవారం తెలిపారు. మే 11న వివాహం చేసుకున్న ఈ జంట మే 20న తమ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. హత్యకు ప్రణాళిక వేసిన మూడు రోజుల తర్వాతే అమలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మే 23న జంట అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత, అనగా.. జూన్ 2న తూర్పు ఖాసీ హిల్స్‌లోని వీసావ్‌డాంగ్ జలపాతం పార్కింగ్ ప్రాంతం సమీపంలోని లోయలో అతను మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ మృతదేహం దొరికింది. అప్పటికే సోనమ్ జాడ తెలియలేదు. అమె కూడా కనిపించకుండా పోయింది.
సోనమ్ ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. పోలీసుల విచారణలో సోనమ్ నిజాన్ని ఒప్పుకుంది. రాజా రఘువంశీ హత్యకు సంబంధించి భార్యతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితులను రాజ్ కుష్వాహా, విక్కీ ఠాకూర్, ఆకాష్ రాజ్‌పుత్ మరియు ఆనంద్ కుర్మిగా గుర్తించారు. ఇందులో రాజ్ కుష్వార్ అనే వ్యక్తి సోనమ్ కు ప్రియుడు. ఇతన్నే కీలక నిందితుడిగా… హత్యకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. అతను సోనమ్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపినట్లు కనుగొన్నారు. కుష్వార్ కాల్ వివరాల రికార్డుల ఆధారంగా ట్రాక్ చేసి అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టు చేసిన మరో నిందితుడిని విక్కీ ఠాకూర్‌గా గుర్తించారు.
రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ ఈ కేసులో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది, సోనమ్ తమ హనీమూన్ కోసం మేఘాలయకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని, కానీ తిరుగు టికెట్ ఏర్పాటు చేయలేదని, రాజాను హత్య చేయడానికి ముందస్తు ప్రణాళిక ఉందని అనుమానించింది. “సోనమ్ మేఘాలయకు టిక్కెట్లు బుక్ చేసుకుంది. ఆమె తమ హనీమూన్ కోసం ముందే ప్లేస్ ను సెలక్ట్ చేసుకుంది. రాజాను చంపడానికి ఇప్పటికే ఒక ప్రణాళిక ఉంది. అందుకు నిరూపణగా ఆమె మేఘాలయ నుండి తిరుగు టికెట్ కూడా బుక్ చేసుకోలేదు” అని రాజా తల్లి అన్నారు.
సోనమ్ రఘువంశీ తండ్రి దేవి సింగ్ మాత్రం తన కుమార్తె చాలా మంచిదని వాదిస్తున్నాడు. తన కూతురుకు ఎలాంటి పాపం తెలియదని అంటున్నాడు. “నా కూతురు నిర్దోషి. నేను ఆమెను పూర్తిగా విశ్వసిస్తున్నాను… ఆమె ఇలాంటిది చేయలేము” అని సింగ్ అన్నారు.