Chandrababu as TDP President: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక.. ప్రకటించిన ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య
Chandrababu Elected as TDP National President: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. 1995లో తొలిసారి టీడీపీ పగ్గాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా మహానాడులో చంద్రబాబును మరోసారి జాతీయ అధ్యక్షుడిగా నాయకులు ఎన్నుకున్నారు.
నామినేషన్లు ప్రతిపాదించిన నేతలు..
మహానాడు రెండో రోజున పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి చంద్రబాబు నామినేషన్లను పలువురు నేతలు ప్రతిపాదించారు. ప్రతిపాదనలకు పార్టీ నేతలు మద్ధతు తెలిపారు. దీంతో చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు.
చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 25 మహానాడులు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లు జూమ్ ద్వారా మహానాడు నిర్వహించారు. ప్రతీ రెండేళ్లకోసారి పార్టీ అధినేత ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. చంద్రబాబును 12వ సారి టీడీపీ అధినేతగా మహానాడు ఎన్నుకుంది. చంద్రబాబుతో వర్ల రామయ్య ప్రమాణం చేయించారు.
వర్ల రామయ్యకు అరుదైన గౌరవం..
టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యకు అరుదైన గౌరవం దక్కింది. పార్టీ అధినేత చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుని హోదాలో వర్ల రామయ్యకు అవకాశం దక్కింది. తనకు అవకాశం కల్పించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు వర్ల కృతజ్ఞతలు తెలిపారు.