Published On:

Minister Narayana: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 50వ అథారిటీ సమావేశం

Minister Narayana: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 50వ అథారిటీ సమావేశం

CRDA 50th Authority Meeting chaired by CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, స్పోర్ట్స్‌ సిటీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు కోసం 10వేల ఎకరాలు అవసరం అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. భూ సేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో భూ సమీకరణకు వెళ్తున్నట్లు తెలిపారు. అమరావతి రెండో దశ భూ సమీకరణకు ఇప్పటికే ఏడు గ్రామాల పరిధిలో 20 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన సీఆర్‌డీఏ 50వ అథారిటీ సమావేశంలో ఏడు అంశాలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

 

స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటుకు 2,500 ఎకరాలు..
స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటుకు 2,500 ఎకరాలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని తెలిపారు. రాజధాని అమరావతిలో 5 స్టార్‌ హోటళ్లకు అనుబంధంగా 10వేల మంది సామర్థ్యంతో కన్వెన్షన్‌ సెంటర్‌ కట్టే సంస్థలకు అదనంగా 2.5 ఎకరాలు, 7,500 మంది సామర్థ్యంలో కన్వెన్షన్‌ సెంటర్‌ కట్టే సంస్థలకు మరో రెండెకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుకను కృష్ణా నదిలో తవ్వుకునేలా సీఆర్‌డీఏకు అనుమతులు మంజూరు చేశారు. ప్రణాళిక ప్రకారం వచ్చే మూడేళ్లలో రాజధానిని తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు.

 

సీఆర్‌డీఏ నిర్ణయాలివే..
-అమరావతిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్‌పీగా పిలిచేందుకు ఆమోదం.
-రాజధానిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదం.
-మందడం, తుళ్లూరు, లింగాయపాలెంలో 2.5 ఎకరాలు నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబీఎస్ ప్రాతిపదికన అమోదం.
-రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ప్రకాశం బ్యారేజీ ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకునేందుకు అనుమతి.
-వచ్చే రెండేండ్లలో అమరావతి నిర్మాణానికి 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అంచనా.
-భూముల కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.
-సీబీఐ, జియోలాజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16     సంస్థలకు  65 ఎకరాల భూ కేటాయింపులకు ఆమోదం.
-రాజధానిలోని ఈ-15 రహదారిపై ఆరు లైన్ల ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం
-పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాలు ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు ఆమోదం.

ఇవి కూడా చదవండి: