Last Updated:

Vijaysai Reddy : కొటరీ మాటలు వినొద్దని జగన్‌కు చెప్పా.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijaysai Reddy : కొటరీ మాటలు వినొద్దని జగన్‌కు చెప్పా.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijaysai Reddy : వైఎస్ జగన్‌ చుట్టూ కోటరీ ఉందని, కోటరీ వల్లే ఆయనకు దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జగన్‌ మనసులో స్థానం లేదని తెలిసిన తర్వాతే తన మనసు విరిగిపోయిందని చెప్పారు. అందుకే వైసీపీ పార్టీ నుంచి వెళ్తున్నట్లు జగన్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్ ఉంటుందన్నారు. జగన్‌ చుట్టూ కొందరు నేతలు కోటరీగా ఏర్పడ్డారని ఆరోపించారు. జగన్‌ను కలవాలంటే కోటరీకి లాభం చేకూర్చాలని, నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదని వ్యాఖ్యలు చేశారు.

కర్త, కర్మ, క్రియ విక్రాంత్‌రెడ్డే..
కాకినాడ పోర్టులో వ్యాపారం చేశారా? లేదా? కోట్లు ఆర్జించారా? అన్న విషయం తనకు తెలియదని సీఐడీ విచారణలో చెప్పినట్లు వెల్లడించారు. గతంలో సీబీఐ, ఈడీ కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ తనను ఏ2గా చేర్చారని, ఇప్పుడు కాకినాడ పోర్టు కేసులో ఏ2 ఉంచారని పేర్కొన్నారు. తాను చేసిందేమీ లేదన్నారు. జగన్‌‌ను కేసు నుంచి తప్పించడానికి మీరు, విక్రాంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా అని అడిగారని, అవన్నీ తనకు తెలియవని చెప్పానన్నారు. మా అల్లుడు శరత్‌ చంద్రారెడ్డి కంపెనీ విషయంలో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. తనకు కుటుంబ బంధాలే ముఖ్యమన్నారు. జగన్‌ ప్రమేయ ఉందా? అని ప్రశ్నించారని, తనకు తెలిసినంత వరకూ కేవీరావు, శరత్‌ చంద్రారెడ్డికి డీల్‌ చేసింది.. కర్త, కర్మ, క్రియ విక్రాంత్‌రెడ్డేనని చెప్పినట్లు వివరించారు. అవసరం అయితే మరోసారి పిలుస్తామని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కేసు ఇక్కడితో ఆగినా, ఆగకపోయినా తనకు వచ్చే నష్టం ఏమీలేదన్నారు. తాను కేవీరావుతో మాట్లాడినట్లు నిరూపించాలని, తాను ఎవరి దగ్గరా ప్రతిఫలం ఆశించలేదని స్పష్టం చేశారు.

మూడున్నరేళ్లు అవమానాలు..
వైసీపీ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు తమ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి, జగన్‌ మనసు విరిచే ప్రయత్నం చేసి విజయం సాధించారన్నారు. మూడున్నరేళ్ల పాటు అవమానాలకు గురైనట్లు చెప్పారు. తాను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకి ఎక్కడానికి ఉపయోగపడిందన్నారు. దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని గుర్తుచేశారు. వైసీపీ నుంచి వెళ్లిపోయినందుకు తాను ఏ విధంగా నష్టపోవడం లేదన్నారు. పార్టీలో తాను చిత్తశుద్ధితో పనిచేసినట్లు తెలిపారు. జగన్‌ బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. జగన్‌ చుట్టూ ఉన్న కోటరీ నుంచి ఎప్పుడు బయటపడతారో అప్పుడే ఆయనకు భవిష్యత్‌ ఉంటుందన్నారు.

నాయకుడు చెప్పుడు మాటలు నమ్మొద్దు..
బయట నుంచి సమాచారం వెళ్లాలన్నా, జగన్‌కు కొత్తవారిని పరిచయం చేయాలన్నా కోటరికీ ఏదో ఒక రకంగా లాభం ఉండాల్సిందేనని చెప్పారు. నాయకుడు చెప్పుడు మాటలు నమ్మకూడదన్నారు. దీంతో నాయకుడితోపాటు పార్టీ, ప్రజలందరూ నష్టపోతారన్నారు. కోటరీ వల్లనే జగన్‌కు తాను దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌‌తో మాట్లాడినప్పుడు తాను చాలా స్పష్టంగా ఇదే చెప్పానన్నారు. మీ మనసులో స్థానం లేనప్పుడు పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదని, అందుకే వెళ్లిపోతున్నానని ఆయనకు చెప్పినట్లు పేర్కొన్నారు. చుట్టూ ఉన్న వాళ్ల మాటలు విని తప్పుదోవ పట్టొద్దని, నిజాలు, అబద్ధాలు ఎవరు చెబుతున్నారో పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసువాలని జగన్‌కు తాను వివరించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ప్రజలకు సేవ చేయాలని, చుట్టూ ఉన్న వాళ్ల మాటల వినొద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. తిరిగి వైసీపీలో చేరే ఉద్దేశం తనకు తెలియదన్నారు. ‘ఘర్‌ వాపసీ’ తనకు అప్లయ్‌ కాదని, ఇప్పుడు తాను వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పారు. వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి: