Last Updated:

Donald Trump : సుంకాలు తగ్గించడానికి ఇండియా అంగీకారం : డొనాల్డ్ ట్రంప్‌

Donald Trump : సుంకాలు తగ్గించడానికి ఇండియా అంగీకారం : డొనాల్డ్ ట్రంప్‌

Donald Trump : అగ్రరాజ్యం అమెరికాపై సుంకాల తగ్గింపునకు ఇండియా అంగీకరించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇండియా అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందని, భారత్‌లో ఏవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా ఉన్నాయన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం ఇండియా చర్యలను తాము బహిరంగ పర్చడం వల్లే సుంకాలను తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు.

కార్ల దిగుమతిపై 110 శాతం సుంకాలు..
ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా త్వరలో ఇండియాలో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఇండియా కార్ల దిగుమతిపై 110 శాతం సుంకాలు విధిస్తోంది. ఇదే విషయంపై ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే పలుమార్లు ఇండియాపై బహిరంగా విమర్శలు చేశాడు. ప్రపంచంలోనే కార్లపై అత్యధిక సుంకాలు విధించే దేశంగా ఆయన అభివర్ణించాడు. తన సంస్థను సుంకాలు లేకుండా ఇండియాలో ప్రవేశపెట్టడానికి మస్క్‌ అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే యూఎస్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇండియా మాత్రం వెంటనే సుంకాలు పూర్తిగా తొలగించే విషయంలో ఆచీతూచి స్పందిస్తోంది. ఈ సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రష్యావి మాకొద్దు.. ఇండియా మా ఆయుధాలు కొనాలి..
ఇండియా ఆయుధాల కోసం రష్యా దేశంపై ఆధారపడడాన్ని మానుకోవాలని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. అప్పుడే ఇండియా, అగ్రరాజ్యం అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా అధునాతన అమెరికన్ రక్షణ వ్యవస్థలను అందించడానికి తమ దేశం సిద్ధంగా ఉందన్నారు. అమెరికా డాలర్‌ను భర్తీ చేయడానికి కొత్త కరెన్సీ కోసం బ్రిక్స్‌ యత్నిస్తే ఇరుదేశాల సంబంధాలు దెబ్బతింటాయన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తమతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికన్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని న్యూఢిల్లీని కోరారు.

ఇండియా, చైనా దేశం సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్‌ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియాను అధిక సుంకాల దేశంగా అభివర్ణించాడు. దీంతో తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. వచ్చే నెల 2న ఇండియా, చైనాలపై విధించే సుంకాలు.. అమెరికా దశను మార్చనున్నాయన్నారు. యూఎస్ అధ్యక్షుడి వ్యాఖ్యలపై భాతర విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. సుంకాలు, సుంకాలేతర అడ్డంకులను అధిగమించడానికి బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి: