WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ విన్నర్ ఎవరో ‘ఏఐ’ తేల్చింది
WTC Final 2023: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గద పట్టేదెవరు? అదేంటీ విజేత ఎవరో తేలడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కదా. అయితే ఫైనల్ ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఆశ్రయించారు. మరి ఏఐ చెప్పిన సమాధానమేంటో ఆసీస్ ప్లేయర్లు వీడియో ద్వారా పంచుకున్నారు.
‘డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ఎవరనేది మేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడిగాం. ఏఐ ఇచ్చిన ఆన్సర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. అదేంటో మీరు చూడండి’ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ఆ వీడియోను షేర్ చేసింది. ఏఐ చెప్పిన ఆన్సర్స్ ను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్, నాథన్ లైయన్ వివరించారు.
ప్యాట్ కమిన్స్- డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా, భారత్ ఉత్కంఠ భరితంగా పోరాడతాయి. అయితే, ఆసీస్ భారీ టార్గెట్‌ను ఛేదించి విజేతగా నిలుస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ రివర్స్ అవుతుంది. పోటీని మరింత రసవత్తరంగా మారుస్తుంది.
ప్యాట్ కమిన్స్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. దూకుడైన ఆటతీరుతో ఆసీస్ శిబిరంలో నమ్మకాన్ని కల్పిస్తాడు. కమిన్స్ ఆడిన ప్రతి షాట్‌తో మ్యాచ్‌ను విజయానికి దగ్గరగా తీసుకొస్తాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సందర్భంలో భారత బౌలర్ వేసిన ఫుల్‌టాస్‌ను ఆకాశమే హద్దుగా బాదేస్తాడు.
హేజిల్‌వుడ్- జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. హేజిల్ అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి షాట్లు ఆడతాడు. బౌండరీలు బాది ఛేదనను మరింత సులువుగా చేస్తాడు. ఆసీస్ అమలు చేసిన ఆటతీరు తో భారత బౌలర్లు మాత్రం తమ రిథమ్‌ను తిరిగి తెచ్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు.
నాథన్ లైయన్- అసాధారణ వ్యూహాన్ని అమలు చేసి ఆసీస్ టెస్టు ఛాంపియన్ గా అవతరించింది. ఓవల్ మైదానం అదిరిపోయింది.
కాగా, ఏఐ చెప్పిన సమాధానం ఎలా ఉన్నా.. తొలి రోజు ఆసీస్ దే పై చేయిగా ఉంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ (146*), స్టీవ్ స్మిత్ (95*) లు క్రీజ్ లో ఉన్నారు.