ICC Champions Trophy: పోరాడి ఓడిన సౌతాఫ్రికా.. ఫైనల్‌లో భారత్‌తో కివీస్ ఢీ

New Zealand beat South Africa in ICC Champions Trophy: భారత్‌తో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడే జట్టు ఏదో తేలిపోయింది. పాకిస్థాన్‌లోని లాహోర్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సఫారి జట్టు పోరాడి ఓడింది. సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా సెమీఫైనల్ 2లో న్యూజిలాండ్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమి చెందింది. దీంతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ చేరింది. దుబాయ్ వేదికగా మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు మరోసారి తలపడనున్నాయి.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోరు సాధించింది. రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102) బౌండరీ లతో హోరెత్తించారు. గ్లెన్ ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్), డారెల్ మిచెల్ (37 బంతుల్లో 49)మంచి సహకారాన్ని అందించారు. దీంతో న్యూజి లాండ్ 362 పరుగులు చేసి సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రి కా బౌలర్లలో ఎంగిడి మూడు, రబాడా రెండు వికెట్లు పడగొట్టగా.. ముల్డర్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఛేజింగ్ చాలా కష్టంగా మారిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతోపాటు రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆరంభం నుంచే ఒత్తిడికి లొంగిపోయారు. డేవిడ్ మిల్లర్ (100 నాటౌట్) పోరాటం వృథా అయిపోయింది. టెంబా బావుమా(56), వాన్రెర్ డసెన్ (69) హాఫ్ సెంచరీలు సాధించినా వేగంగా పరుగులు చేయలేక పోయారు. దీంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర, బ్రేస్వెల్ తలో వికెట్ తీశారు.