India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

India vs New Zealand final match in icc champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌తో న్యూజిలాండ్ ఫైనల్ పోరులో తలపడుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్(67), బ్రేస్ వెల్(53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రచిన్(37), ఫిలిప్స్(34) పర్వాలేదనింపించారు.
ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్రలు తొలి వికెట్‌కు 57 పరుగులు చేశారు. వీరిద్దరూ 7 ఓవర్లలోనే 50 పరుగులు పూర్తి చేశారు. అయితే వరుణ్ వేసిన 8వ ఓవర్లలో 5వ బంతికి విల్ యంగ్(15) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో కీలక భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర(37), కేన్ విలియమ్సన్(11).. స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ బౌలింగ్‌లో వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత భారత బౌలర్లు మరింత కఠినంగా బౌలింగ్ వేశారు. ఈ సమయంలో లేథమ్(14) జడేజా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 108 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.
కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్‌ను డారిల్ మిచెల్(63), ఫిలిప్స్(34) ఆదుకున్నారు. అయితే ఈ ఇద్దరి 57 పరుగుల భాగస్వామ్యాన్ని వరుణ్ రూపంలో ముగింపు పడింది. వరుణ్ బౌలింగ్‌లో 38వ ఓవర్‌లో ఫిలిప్స్ ఔట్ అయ్యాడు. నెమ్మదిగా ఆడుతున్న డారిల్ మిచెల్(63)ను షమీ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత శాంటర్న్(8) రనౌట్ అయ్యాడు. ఇక చివరిలో బ్రాస్ వెల్(53) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్, కుల్ దీప్ చెరో రెండు వికెట్లు, షమీ, జడేజా తలో వికెట్ తీశారు.