Hardik Pandya: మ్యాచ్ గెలిచాం.. కానీ సంతృప్తిగా లేదు
ఐపీఎల్ సీజన్ 16 లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తాజాగా గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు..
Hardik Pandya: ఐపీఎల్ సీజన్ 16 లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తాజాగా గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు ఇరు జట్ల అభిమానులను టెన్షన్ పెట్టింది. హోరా హోరీగా జరిగిన మ్యాచ్ లో చివరికి విజయం గుజరాత్ ని వరించింది. అయితే ఎంతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో గెలిచినప్పటికీ గుజరాత్ జట్టు ప్రదర్శనపై సారధి హార్దిక్ మాత్రం సంతృప్తిగా లేడు.
మిడిల్ ఓవర్స్ పై దృష్టి పెట్టాల్సింది: హార్దిక్(Hardik Pandya)
మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ.. ‘మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ అనుకున్నంత సంతృప్తిగా లేదు. నిజాయితీ గా చెప్పాలంటే గురువారం మ్యాచ్ కు ఆటగాళ్లను నేను అభినందించట్లేదు. ఒక దశలో స్ట్రాంగ్ గా కనిపించి కూడా చివరి బంతి వరకు ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ మేం చాలా నేర్చుకోవాలి. మిడిల్ ఓవర్స్ పై దృష్టి పెట్టాల్సింది. అక్కడ మరిన్ని రిస్క్ లు తీసుకుంటే బాగుండేది. అసలు మ్యాచ్ చివరి వరకు రాకుండా.. మిడిల్ ఓవర్స్ లో భారీ షాట్లు ఆడాల్సింది. ఈ మ్యాచ్ లో జరిగిన పొరపాట్లను .. వచ్చే మ్యాచ్ ద్వారా సరిదిద్దుకునేలా ఫోకస్ చేస్తాం’ అని తెలిపాడు. గత మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ మ్యాచ్ గా నిలిచిన పేసర్ మోహిత్ శర్మను పాండ్యా అభినందించాడు. ఐపీఎల్ లో రెండేళ్ల తర్వాత మొదటి మ్యాచ్ ఆడిన మోహిత్.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడని హార్దిక్ చెప్పాడు.
రీఎంట్రీలోనే అదరగొట్టి..
గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ.. 2014 లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. అలాంటి పరిస్థితి నుంచి మోహిత్ ఫాం కోల్పోయి ఐపీఎల్ కు దూరం అయ్యాడు. 2020లో ఢిల్లీకి ఆడిన ఈ పేసర్ తర్వాత ఐపీఎల్ లో కనిపించలేదు. ఒకప్పుడు రూ. 6.5 కోట్లు కు అమ్ముడుపోయిన మోహిత్ ను .. మినీ వేలంలో గుజరాత్ రూ. 50 లక్షలకే దక్కించుకుంది. మోహిత్ గత ఏడాది గుజరాత్ కు నెట్ బౌలర్ గా పనిచేశాడు. గతంలో కంటే మరింత ఫిట్ గా మారి సరికొత్త లుక్ లో ఈ సీజన్ లో అడుగుపెట్టాడు. రీఎంట్రీలో తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు. పంజాబ్ మ్యాచ్ లో రెండు వికెట్టు తీశాడు.