Last Updated:

Virat Kohli: విరాట్ కోహ్లీ పేరిట అరుదైన రికార్డులు.. ఐపీఎల్‌లో ఒకేఒక్కడు!

Virat Kohli: విరాట్ కోహ్లీ పేరిట అరుదైన రికార్డులు.. ఐపీఎల్‌లో ఒకేఒక్కడు!

Chase Master Virat Kohli Breaks Records in IPL: ఐపీఎల్ 2025ను ఆర్సీబీ విజయంతో ప్రారంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 36 బంతుల్లో 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌లో కోల్‌కతాపై 1000 పరుగులు పూర్తి చేసి ఐపీఎల్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.

 

ఇప్పటివరకు విరాట్ కోహ్లీ నాలుగు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా తన పేరిట రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ కోల్‌కతాపై 962 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్‌లో 10వ ఓవర్‌లో 1000 పరుగుల మార్క్ దాటాడు. కాగా, విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లపై కోహ్లీ 1000 పరుగులు చేశాడు. దీంతో పాటు కోల్‌కతాపై 1000 పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్(1093), రోహిత్ శర్మ(1070) పరుగులు చేశారు.

 

అంతేకాకుండా, టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ 400 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మేరకు కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఘనత సాధించాడు. అంతకుముందు రోహిత్ శర్మ(448 మ్యాచ్‌లు), దినేష్ కార్తిక్(412మ్యాచ్‌లు) ఉన్నారు. అలాగే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ(12,945) పరుగులు చేయగా.. గేల్(14,563) తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత హేల్స్(13,610), షోయబ్(13,537), పొలార్డ్(13,537) స్థానాల్లో ఉన్నారు.