Air India: ఎట్టకేలకు అమెరికా బయలుదేరిన రష్యాలో ఇరుక్కున్న విమాన ప్రయాణికులు
సాంకేతిక లోపంతో రష్యాలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఎట్టకేలకు అమెరికా పయనమయ్యారు. దాదాపు 39 గంటల తర్వాత గురువారం ఉదయం మరో విమానంలో ప్రయాణికులంతా శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరారు.
Air India: సాంకేతిక లోపంతో రష్యాలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఎట్టకేలకు అమెరికా పయనమయ్యారు. దాదాపు 39 గంటల తర్వాత గురువారం ఉదయం మరో విమానంలో ప్రయాణికులంతా శాన్ ఫ్రాన్సిస్కో కు బయలు దేరారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలు దేరిన ఎయిర్ ఇండియా (AI173) విమానంలోని ఓ ఇంజిన్ లో సాంకేతిక లోపం రావడంతో అది రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. జూన్ 6 వ తేదీన మంగళవారం ఉదయం 4.05 గంటలకు ఢిల్లీ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానంలో టెక్నికల్ సమస్యను పైలట్లు గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించి అక్కడ మగడాన్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దించారు. ఈ విమానంలో 216 మంది ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రయాణికుల ఇక్కట్లు(Air India)
అయితే రష్యా రాజధాని మాస్కోకు 10 వేల కిలోమీటర్ల దూరంలో ఈ మగడాన్ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉండటానికి హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులను డార్మిటరీస్ లో ఉంచారు. వీలైనంత త్వరగా ప్రయాణికులను అక్కడి నుంచి తరలించేందుకు ఎయిరిండియా అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ, రావాల్సిన కొన్ని అనుమతులు, ఇతర కారణాల వల్ల ప్రయాణికుల తరలింపు ఆలస్యమైంది. ఈ క్రమంలో ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం 3. 20 గంటలకు ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక విమానం ముంబై నుంచి మగడాన్‌కు బయలు దేరింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విమానం రష్యా కు చేరుకుంది. అనంతరం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రయాణికులను తీసుకుని ప్రత్యేక విమానం శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరింది.
ఈ విమానం శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకున్న తర్వాత ప్రయాణికులకు కావాల్సిక అధికారికి అనుమతుల కోసం ఎయిర్ ఇండియా అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిబ్బందిని నియమించినట్టు అధికారులు తెలిపారు. వైద్యం, రవాణా, ప్రయాణ ఏర్పాట్లను చేశామన్నారు.
అమెరికా స్పందన(Air India)
కాగా.. రష్యాలో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఎయిర్ ఇండియా విమానంపై అమెరికా స్పందించింది. పరిస్థితులను తాము గమనిస్తున్నట్టు తెలిపింది. ఈ విమానంలో అమెరికా పౌరులు 50 కంటే తక్కువ ఉన్నట్లు వెల్లడించింది.