GBS in Telangana: రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కొత్త వ్యాధి.. తొలి మరణం నమోదు
![GBS in Telangana: రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కొత్త వ్యాధి.. తొలి మరణం నమోదు](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-09-at-18.55.13.jpeg)
Woman dies of Guillain-Barre Syndrome in Telangana: మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నది. వ్యాధిబారిన పడిన 25 ఏండ్ల మహిళ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన వివాహిత జీబీఎస్ అనే నరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితం ఆమెకు వ్యాధి నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నది. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
నరాల నొప్పులతో అనారోగ్యం..
కాగా, మృతిరాలికి ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఇటీవల కుమార్తె జన్మించింది. కుమార్తె జన్మించిన తర్వాత నెలరోజుల కిందట నరాల నొప్పులతో మహిళ అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట, హైదరాబాద్లోని నిమ్స్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. వైద్యానికి రూ.లక్షలు వెచ్చించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మహారాష్ట్రలోని పుణెలో జీబీఎస్ కారణంగా పలువురు మృతిచెందారు. ఇప్పటికే చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో వ్యాధితో మరణం సంభవించడం ఇదే మొదటిదని వైద్యులు తెలిపారు.
వ్యాధి లక్షణాలు ఇవే..
శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని నరాలపై దాడిచేసే అరుదైన పరిస్థితిని గులియన్ బారే సిండ్రోమ్ అని అంటారు. జీబీఎస్ వ్యాధి సోకిన వారిలో శరీరమంతా తిమ్మిరిగా అనిపిస్తుంది. తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ప్రాథమిక దశలో కనిపిస్తాయి. వీటితోపాటు పొత్తికడుపు నొప్పి, ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, డయేరియా, కండరాలు బలహీనంగా మారడం వంటివి గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు. ఈ వైరస్ నీటి ద్వారా, కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా రూపంలో సోకుతుంది.