Mamunur Airport : మామునూరు ఎయిర్‌పోర్టు భూనిర్వాసిత రైతుల ఆందోళన

Mamunur Airport : వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కేంద్రం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం భూ సర్వే కోసం అధికారులు వెళ్లారు. విషయం తెలుసుకున్న మామునూరు విమానాశ్రయ భూ నిర్వాసిత రైతులు సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో సత్యపాల్, రెవెన్యూ అధికారులతో భూ నిర్వాసిత రైతులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రైతులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
గుంటూరుపల్లె, నక్కలపెల్లి గ్రామస్తులతోపాటు మూడు గ్రామాల ప్రజలు వరంగల్- నెక్కొండ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. విమానాశ్రయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో రెండు మండలాలను కలిపే రోడ్డును తాము కోల్పోతున్నామని వాపోయారు. తమకు కొత్త రోడ్డు నిర్మించి, భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం నష్ట పరిహారం చెల్లించే వరకూ భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఇదే విషయమై పరకాల ఎమ్మెల్యేతో మాట్లాడగా, రోడ్డు లేదంటూ దురుసుగా మాట్లాడారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్‌పోర్టు ఆపరేషన్స్‌కి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 150 కి.మీ పరిధిలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ జీఎంఆర్‌తో చర్చలు జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు జీఎంఆర్ సంస్థ కూడా ఒప్పుకుంది. ఈ క్రమంలో మామునూరు ఎయిర్‌పోర్టు పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలంలో అధికారులను సర్వే చేపట్టాలని ఆదేశించింది.
మామునూరు ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని కవాడిగూడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్టుకు 2,800 మీటర్ల రన్‌వే అవసరమన్నారు. 280 ఎకరాలు అదనంగా భూసేకరణ అవసరమని కేంద్రం నుంచి ప్రతిపాదనలు వచ్చాయని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందువల్లే ఆలస్యమైందని చెప్పారు.