AICC: కొత్త ఇన్‌చార్జిలను ప్రకటించిన ఏఐసీసీ.. తెలంగాణకు మీనాక్షి నటరాజన్
![AICC: కొత్త ఇన్‌చార్జిలను ప్రకటించిన ఏఐసీసీ.. తెలంగాణకు మీనాక్షి నటరాజన్](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/telangana-aicc.webp)
Meenakshi Natarajan As New Incharge of Telangana Congress: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జిలను ప్రకటించింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్న మీనాక్షి తెలంగాణ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
పలు రాష్ట్రాలకు..
ఏఐసీసీ పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్కు కొత్త ఇన్‌చార్జిలు.. పంజాబ్, జమ్ము కశ్మీర్ కొత్త జనరల్ సెక్రటరీలను నియమించింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి..
మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పనిచేస్తూ వచ్చారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ వింగ్‌లో పనిచేయగా, ఏఐసీసీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2009 ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే తర్వాత రెండుసార్లు ఓడిపోయారు. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీమ్ సభ్యురాలిగా గుర్తింపు పొందారు.
మున్షీపై ఆరోపణలు..
కొంతకాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జి మార్పు ఖాయమంటూ ఆ పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. అయితే దీపాదాస్ మున్షీ కేరళ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణను పట్టించుకోవటం లేదని ఆరోపణలున్నాయి. సీనియర్లు కలువకుండా అవమానిస్తున్నారన్న చర్చ పార్టీలో నడుస్తూ వచ్చింది. దీపాదాస్ మున్షీ తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని, వెంటనే ఆమెను మార్చాలని తెలంగాణ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే ఆమెను కేరళకు పరిమితం చేసి, కొత్త వారికి అవకాశం ఇవ్వడం పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది.