Published On:

KTR Open Letter : కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

KTR Open Letter : కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

KTR Open Letter : కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ భూముల్లో చెట్లను ప్రభుత్వం తొలగిస్తుండగా, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించి వెంటనే అక్కడ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. చెట్ల నరికివేతపై పలు ప్రశ్నలు సంధించి వివరణ ఇవ్వాలని సర్కారుకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం అప్రమత్తమై మంత్రులతో ఓ కమిటీ వేసింది. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కంచ గచ్చిబౌలి భూములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు.

 

 

ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు..
అందులో ప్రకృతి పట్ల లోతైన ప్రేమను, మన సమష్టి భవిష్యత్ పట్ల మీకు ఉన్న ఆందోళనను పంచుకునే తోటి పౌరుడిగా లేఖ రాస్తున్నట్లు తెలిపారు. కంచ గచ్చిబౌలి అడవిని రక్షించడానికి తమ స్వరాన్ని పెంచిన ప్రతి విద్యార్థి, పర్యావరణవేత్త, జర్నలిస్టు, పౌరుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీ ధైర్యం దేశానికి స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పారు. అందరం కలిసి చేసి ఉద్యమంలో 400 ఎకరాల పచ్చదనం, 734 జాతుల పుష్పించే మొక్కలు, 220 జాతుల పక్షులు, 15 జాతుల సరీసృపాలు, 10 జాతుల క్షీరదాలకు జీవనాధారం అయిన ప్రకృతిని కాపాడామని తెలిపారు. 400 ఎకరాల భూమి ఒక రియల్ ఎస్టేట్ కాదని అన్నారు.

 

 

పోరాటం ఇంకా ముగియలేదు..
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తమ పోరాటం ముగియలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థపూరితంగా పర్యావరణ శ్రేయస్సును పణంగా పెట్టాలని ఎంచుకున్నట్లు చెప్పడానికి తనకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి ముసుగులో 400 ఎకరాల అటవీ భూమిని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. హరిత హత్యకు సమానమైన ప్రణాళికను ముందుకు తెచ్చారని, గొప్ప ప్రతిఘటనలో ముందంజలో యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారని కొనియాడారు. విద్యార్థులతో తమ గొంతుకను వినిపించి, భుజం భుజం కలిపి నిలబడిన అనేక మంది కార్యకర్తలు, జర్నలిస్టులు, పౌరులకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

 

 

ప్రభుత్వం బెదిరింపులు..
ప్రభుత్వం బెదిరింపుల ప్రచారాన్ని ప్రారంభించిందని మండిపడ్డారు. విద్యార్థులను నిందించడం, వారి ఉద్దేశాలపై సందేహం వ్యక్తం చేయడం, విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని వేరే ప్రాంతానికి మార్చాలనే నెపంతో కూల్చివేస్తామని బెదిరించడం ద్వారా వారు తమ తప్పుల నుంచి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించారని గుర్తుచేశారు. ఇది కేవలం విశ్వవిద్యాలయంపై దాడి కాదని, ప్రజాస్వామ్య విలువలు, పర్యావరణ హక్కులు, మన సామూహిక మనస్సాక్షిపై దాడి చేయడమేనని కేటీఆర్ తన లేఖలో రాసుకొచ్చారు. ఎకో పార్కు పేరుతో ప్రభుత్వం మరో మోసం చేసేందుకు సిద్ధమైందని, దీనిపై అందరం కలిసికట్టుగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కేటీఆర్ తన లేఖలో పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి: