Vijayawada City: విజయవాడలో డయేరియా మృత్యకేళి.. 9 మంది మృతి
గత ఐదు రోజులుగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం వలన ఇప్పటికి 9 మంది మరణించారు . అతిసారం ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా మరోకరు మరణించడంతో అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది
Vijayawada City: గత ఐదు రోజులుగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం వలన ఇప్పటికి 9 మంది మరణించారు . అతిసారం ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా మరోకరు మరణించడంతో అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మొగల్రాజుపురంలో గల్లా కోటేశ్వరరావు(60) వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. ఇప్పటికే డయేరియా లక్షణాలతో మొగల్రాజపురం, పాయకాపురంలో ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో విజయవాడ నగరంలో గత ఐదు రోజుల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు.
అధికారులు స్పందించాలని చంద్ర బాబు డిమాండ్..(Vijayawada City)
ఒక్క మొగల్రాజపురంలోనే ఇప్పటివరకు ఆరుగురు విరేచనాలతో మృతి చెందారు. పాయకాపురం, అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతాల్లో వారం వ్యవధిలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంత తీవ్రత ఉన్నా.. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు పెట్టలేదు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని.. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని కోరారు.