AP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ‘జర్నీ’ సినిమా తరహాలో ఢీకొట్టుకున్న బస్సులు

Massive Road Accident in Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో తెల్లవారుజామున రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
వివరాల ప్రకారం.. మంగళవారం వేకువజామున సుమారు 3.30 నిమిషాలకు రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి ఏపీకి ఓ బస్సు వస్తుండగా.. మదనపల్లె నుంచి మరో ప్రైవేట్ బస్సు వెళ్తోంది.
ఈ సమయంలో రెండు బస్సులు కర్ణాటక సరిహద్దులో ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో బస్సులో ఉన్న ప్రయాణికుల అరుపులు మిన్నంటాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. అయితే అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.