Last Updated:

Nagoba Jatara: నేటి నుంచే నాగోబా జాతర.. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు

Nagoba Jatara: నేటి నుంచే నాగోబా జాతర.. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు

All Set For Nagoba Jatara of Mesrams In Adilabad District: ఆదిమ గిరిజనుల ప్రాచీన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనుంది. నేటి నుంచి ఫిబ్రవరి 4 వరకు 8 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నిర్వహించే ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతరకు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిసా, తెలంగాణలోని వేర్వేరే ప్రాంతాల నుంచి వేలాదిగా ఆదివాసీలు హాజరుకానున్నారు.

ఎన్నో ప్రత్యేకతలు..
పుష్యమి మాసం నెలవంక కనిపించిన రోజు మెస్రం వంశస్థులు నాగోబాకు మొక్కి.. మరుసటి రోజు జాతర నిర్వహణకు సమాయత్తమవుతారు. సిరికొండ కుమ్మరులకు మట్టి కుండలు చేయమని చెప్పి ఏడు గ్రామాల్లో పర్యటిస్తారు. సిరికొండ గ్రామ కుమ్మరి గుగ్గిల వంశస్థులే తరాలుగా కుండలు చేస్తున్నారు. జాతరకు మూడు రోజుల ముందు కేస్లాపూర్‌లోని మర్రిచెట్ల వద్దే మెస్రం వంశస్థులు బస చేస్తారు. మరణించిన వారిని తలచుకొని పిండ ప్రదానం చేస్తారు. జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వేలాదిగా వచ్చినా వంటలు మాత్రం 22 పొయ్యిల మీదే చేస్తారు. ఈ పొయ్యిలు ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తారు.

పాదయాత్రగా వెళ్లి పవిత్ర జలాలు
మెస్రం వంశస్థులు కేస్లాపూర్‌లోని మురాడి(గ్రామ గుడి)లో సమావేశమై పూజ కలశం తీసుకుని గోదావరి నది పవిత్ర జలాలను తీసుకురావడానికి పాదయాత్రగా బయల్దేరుతారు. ఈ ప్రయాణంలో ఊరి పొలిమేరల్లో మాత్రమే బస చేస్తారు. మంచిర్యాల జిల్లా కలమడుగు గ్రామ శివారులోని గోదావరికి చేరుకుని పవిత్ర జలాన్ని సేకరిస్తారు. కలశాన్ని చెట్టుపైనే ఉంచుతారు. నాగోబాకు గోదావరి నుంచి తీసుకొచ్చిన జలంతో అభిషేకం చేస్తారు. ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆదివాసీల సంప్రదాయ వాయిద్యాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో నవధాన్యాల మొలకలు, రాగి చెంబులో పాలు అన్నింటిని తెల్లని బట్టలో పుట్టపై ఉంచి దూరంగా వేచిచూస్తారు. నాగేంద్రుడు వచ్చి పాలను తాగుతాడని ఇప్పటికీ భావిస్తారు.

కోడళ్ల, అల్లుళ్ల పరిచయాలు
మెస్రం వంశస్థుల్లో వివాహాలైతే, ఆ కోడళ్లను కేస్లాపూర్‌లోని నాగోబా దేవుడి వద్దకు తీసుకొచ్చి, దంపతులిద్దరినీ తెల్లని దుస్తులతో ఆలయ ప్రవేశం చేయిస్తారు. మెస్రం వంశస్థుల పటేల్‌ సతీమణి ఆధ్వర్యంలో కుల దేవత వద్ద సమావేశ పరచి, పెద్దలంతా కలిసి ఆ జంటకు ఆశీస్సులిస్తారు. అప్పుడే మెస్రం వంశస్థుల కోడళ్లుగా పరిగణించబడతారు. అలాగే.. నాగోబా పూజలకు ముందు ఆలయ ఆవరణలోని పుట్టను మెత్తని మట్టితో అద్దే పనిని మెస్రం వంశం అల్లుళ్లకే ఇస్తారు. మట్టిని అల్లుళ్లు మెత్తగా చేస్తే, కూతుళ్లు ఈ మట్టితో పుట్టను చేసి మొక్కులు తీర్చుకొంటారు.

ప్రజా దర్బార్‌ ప్రత్యేకత
నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు 800 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఏ సదుపాయాలూ లేని ఈ దట్టమైన అడవిలోని ఆదివాసీలు.. నాగరికులను చూసి భయపడేవారు.తర్వాతి కాలంలో ఇక్కడి‘జల్‌ జంగల్‌ జమీన్‌’మీద అధికారం ఆదివాసీలకే ఉండాలంటూ కుమురం భీం పోరాడి అమరుడయ్యాడు. దీంతో అక్కడి తిరుగుబాటు మీద ఉలికి పడిన నాటి నిజాం సర్కారు గిరిజన ప్రాంతాల పరిస్థితులను, ఆదివాసీల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌ డార్ఫ్‌ ఆదిలాబాద్‌ జిల్లాకు పంపింది. జిల్లాకు వచ్చిన ఆయన దృష్టి కేస్లాపూర్‌ జాతరపై పడింది. అక్కడకు అందరూ వస్తారని అక్కడే సమస్యలు తెలుసుకుంటే మంచిదని భావించారు. అలా.. 1946లో మొదటి దర్బార్‌ను నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఈ దర్బార్‌ను నిర్వహిస్తున్నారు. గిరిజనులు వారి సమస్యలను ఇక్కడ ప్రసావిస్తే వాటిని అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తుంటారు.