Rana Daggubati: మిరాయ్ కోసం భల్లాలదేవ.. నెక్స్ట్ లెవెల్ కాంబో

Rana Daggubati: ఇంద్ర సినిమాలో నేనున్నా నాయనమ్మ అంటూ బాలనటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఇక స్టార్ హీరోల సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన తేజ.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న తేజ.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు మిరాయ్ అంటూ రాబోతున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రాల్లో మిరాయ్ ఒకటి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సరసన రిత్విక నాయక్ నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ విలనిజం ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే తేజ, మనోజ్ మధ్య యుద్ధం ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటే.. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో భల్లాలదేవ కూడా జాయిన్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. తేజ సజ్జా, మంచు మనోజ్.. ఇక ఇప్పుడు రానా దగ్గుబాటి కూడా యాడ్ అవ్వడంతో అసలు నెక్స్ట్ లెవెల్ కాంబో అని చెప్పొచ్చు. కుర్రహీరోలు అందరూ కలిసి ఈసారి మ్యాజిక్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రానా దగ్గుబాటి.. హీరో, విలన్, నిర్మాత, హోస్ట్.. ఇలా ఒకటి అని చెప్పలేం. 24 క్రాఫ్ట్స్ లో రానా ఉంటాడు. అయితే రానా నటన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. హీరోగా కెరీర్ ను ప్రారంభించిన ఈ కుర్ర హీరో.. అంతగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇక బాహుబలి లో భల్లాలదేవగా నటించి .. పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఆ తరువాత రానా హీరోగా కంటే.. కీలక పాత్రల్లోనే కనిపించాడు.
అందుతున్న సమాచారం ప్రకారం రానా.. మిరాయ్ లో భాగం అయ్యాడట. మొదట ఈ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ ను సంప్రదించగా.. డేట్స్ ఖాళీ లేని కారణంగా దుల్కర్ నో చెప్పడంతో ఆ పాత్రలో రానాను తీసుకున్నారట. రానా నెగిటివ్ క్యారెక్టర్ లో చేస్తున్నాడా.. ? పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రానా వలన మిరాయ్ మార్కెట్ మరింత పెరుగుతుంది అని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.