Music Director Koti: ‘నా రాజ్ లేడంటే ఎంతో బాధగా ఉంది’.. కన్నీరు పెట్టుకున్న కోటి
టాలీవుడ్ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
Music Director Koti: టాలీవుడ్ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. అయితే, తన ప్రాణ స్నేహితుడు, సోదరుడి లాంటి వాడైన రాజ్ మరణ వార్త తెలుసుకున్న సంగీత దర్శకుడు కోటి కన్నీరు మున్నీరయ్యారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో రాజ్-కోటి ద్వయం ఎన్నో అపురూపమైన పాటలు అందించింది. ఇద్దరూ కలిసి చేసిన ఎన్నో సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఉన్నాయి. రాజ్ మరణ వార్త తెలుసుకున్న కోటి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.
రాజ్ మరణించడం బాధగా ఉంది(Music Director Koti)
ప్రస్తుతం చెన్నైలో ఉన్న కోటి.. రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. తాము ఇద్దరం ఈమధ్య ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నామన్నారు. అపుడు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుగా అనిపించలేదని.. ఇంతలో గుండెపోటుతో ఆయన మరణించడం ఎంతో బాధగా ఉందన్నారు. రాజ్ కోటిగా తాము ఎన్నో సినిమాలకు కలిసి పని చేశామని.. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. తాము విడిపోయిన తర్వాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా వాటిని కూడా రాజ్-కోటి పాటలు అనేవారని తెలిపారు. తామిద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించామని.. ఈ రోజు నా రాజ్ లేడంటే ఎంతో బాధగా ఉందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మా పాటల రూపంలో నా రాజ్ కలకాలం ఉంటాడన్నారు.
వద్దురా విడిపోవద్దు అని..
కాలానుగుణంగా వచ్చిన పరిస్థితుల వల్ల తాము విడిపోయినట్టు కోటి తెలపారు. తాను ఎన్ని సినిమాలు చేసినా కూడా రాజ్ తన పక్కన ఉన్నాడనే ధైర్యంతోనే చేయగలిగానన్నారు. రాజ్‌కి తాను ఒక తమ్ముడిలాంటివాడినని తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాము చిన్ననాటి స్నేహితులమని.. ఇద్దరం విడిపోవడం ఇప్పటికీ బాధగానే ఉంటుందన్నారు. వద్దురా విడిపోవద్దు అని రాజ్ అన్నాడని.. కానీ అప్పటి పరిస్థితుల వల్ల విడిపోయామన్నారు. పాటల రూపంలో రాజ్ ఎప్పటికీ బతికే ఉంటాడని కోటి తెలిపారు.
చిరంజీవి సంతాపం
కాగా సంగీత దర్శకుడు రాజ్ మృతి పట్ల మెగాస్థార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటిల్లో ‘రాజ్’ ఇక లేరు అని తెలవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో ప్రతిభ ఉన్న రాజ్.. కెరీర్ తొలి దశలో నా చిత్రాలకు అందించిన బాణీలు ఆయా సినిమాల విజయంలో ముఖ్య పాత్ర పోషించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. రాజ్ అకాల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి!’అని చిరంజీవి ట్వీట్ చేశారు.