Royal Enfield Electric Bike: ఇది కదా అసలు మజా అంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. లాంచ్ అయితే కిక్కు మామూలుగా ఉండదుగా..!
Royal Enfield Electric Bike: రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ కంపెనీ. ఇది దశాబ్దాలుగా దేశీయ మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్‌లు, ఫీచర్లను కలిగి ఉన్న వివిధ బైక్‌లను విక్రయిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటలీలో జరిగిన ‘మిలన్ మోటార్ సైకిల్ షో’ (EICMA – 2024)లో తన మొట్టమొదటి సరికొత్త ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ చాలా లోతైన ఆలోచనతో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు ‘ఫ్లయింగ్ ఫ్లీ’ అనే పేరు పెట్టింది. 1939 -1945 మధ్య, బ్రిటిష్ సైన్యం పారాచూట్ రెజిమెంట్ సైనికులు జర్మన్ నియంత హిట్లర్ నాజీ దళాలకు వ్యతిరేకంగా 125 cc ఫ్లయింగ్ ఫ్లీ మోటార్ సైకిళ్లను ఉపయోగించారు. ఈ బైక్‌లకు గుర్తుగా కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు ‘ఫ్లయింగ్ ఫ్లీ’ అని పేరు పెట్టింది.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అధునాతన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది సర్కిల్ హెడ్‌లైట్, ఫ్రంట్ గిర్డర్ ఫోర్క్ సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది. సింగిల్-పీస్ సీటును కలిగి ఉన్న ఈ బైక్ ఎక్కువగా సిటీ ట్రాఫిక్ కోసం ఉపయోగించేలా డిజైన్ చేశారు.
ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో పుల్-టిఎఫ్‌టి క్లస్టర్ ఉంది. బ్లూటూత్ సహాయంతో దీన్ని స్మార్ట్‌ఫోన్ యాప్‌కి సులభంగా కనెక్ట్ చేయచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ , కార్నరింగ్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రైడర్ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ఫ్లయింగ్ ఫ్లీ సి6 ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ప్యాక్, రేంజ్ మోటార్ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. కొత్త బైక్ 2026 లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇటలీలో జరిగిన ‘మిలన్ మోటార్‌సైకిల్ షో’లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించడమే కాదు. దీనితో పాటు ‘ఫ్లయింగ్ ఫ్లీ S6’ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్‌ను విడుదల చేసింది. ఇదే కార్యక్రమంలో తయారీ దశలో ఉన్న హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రదర్శించారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ‘ఫ్లయింగ్ ఫ్లీ సి6’ ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించడంతో మొత్తం దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి ప్రవేశించడాన్ని ధృవీకరించింది. స్పష్టంగా ఈ మోటార్‌సైకిల్ చాలా అధునాతనమైనది, దాని లాంచ్ తర్వాత కొత్త చరిత్ర సృష్టించనుంది ఈ ఎలక్ట్రిక్ బైక్.