Mahindra XEV 9e And BE 6 Electric SUV: మార్కెట్లో మేమే తోపు.. మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసా..?

Mahindra XEV 9e and BE 6 Electric SUV: దేశంలోని ప్రముఖ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ తయారీ కంపెనీ మహీంద్రా ఇటీవల తన రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు XEV 9e, BE 6 లను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ లుక్స్, అద్భుతమైన పనితీరుతో వస్తున్న ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు వాటి ప్రత్యేక డిజైన్‌తో చాలా వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో ఎలా దూసుకుపోతున్నాయో కంపెనీ వెల్లడించింది.
కూపే స్టైల్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 21.90 లక్షలు. ‘BE 6e’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 18.90 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. మహీంద్రా అధికారిక ప్రకటన ప్రకారం.. కంపెనీ ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల డెలివరీని మార్చి 20, 2025 నుండి ప్రారంభించిందని పేర్కొంది. ఆ తర్వాత ఇప్పటివరకు 3,000 యూనిట్లకు పైగా డెలివరీ చేసింది.
టాప్ వేరియంట్లకు అత్యధిక డిమాండ్ ఉందని కంపెనీ చెబుతోంది. వినియోగదారులు పూర్తిగా లోడ్ చేసిన ప్యాక్-త్రీ వేరియంట్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. XEV 9e ప్యాక్-త్రీ వేరియంట్ల ధరలు రూ. 27.90 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్‌కు రూ. 30.50 లక్షల వరకు ఉంటాయి. BE 6 ప్యాక్-త్రీ వేరియంట్ ధర రూ. 24.50 లక్షల నుండి రూ. 26.90 లక్షల మధ్య ఉంటుంది. ప్యాక్-త్రీ వేరియంట్‌లో కంపెనీ 79 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అందించింది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 656 నుండి 683 కి.మీ డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది.
కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన XEV 9e అత్యధిక కొనుగోలుదారులను పొందుతోందని మహీంద్రా తెలిపింది. ప్రస్తుత బుకింగ్‌ల ఆధారంగా దాదాపు 59శాతం మంది ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను ఎంచుకున్నారు. మరోవైపు, దాదాపు 41శాతం మంది BE6 పై ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఈ రెండు కార్ల కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు 6 నెలలు, కంపెనీ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది.