Pendrive: టెక్నాలజీని మంచికి ఉపయోగించాలనే సందేశమే.. ‘పెన్ డ్రైవ్’ మూవీ
Pendrive movie launched today: టాలీవుడ్లో నూతన నటీనటులు విష్ణు వంశీ, రియా కపూర్ హీరో హీరోయిన్లుగా శ్రీ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై కటకం వెంకటేశ్వర్లు సమర్పణలో దర్శకుడు ఎంఆర్ దీపక్ రూపొందిస్తున్న సినిమా ‘పెన్ డ్రైవ్’. ఈ సినిమాకు కె. రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. బుజ్జి బొగ్గారపు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కిస్తుండగా.. దసరా పండుగ సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాయి కుమార్ క్లాప్ ఇవ్వగా.. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఇక, నిర్మాత కె రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ కథను విన్న వెంటనే చాలా బాగుందని, నా పాత్ర కూడా చాలా బాగా రాశారని నటుడు సాయి కుమార్ అన్నారు. సినిమా పేరు కూడా చాలా నచ్చిందని, సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించారు. ెక్, హీరో హీరోయిన్లకు, మిగతా నటి నటులకు మంచి పేరు రావాలని, నిర్మాతకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడారు. దర్శకుడు ఎంఆర్ దీపక్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వ్యక్తి అన్నారు. ఎన్నో సినిమాలకు అసోసియేట్, కో డైరెక్టర్ గా వర్క్ చేశారన్నారు. పెన్ డ్రైవ్ సినిమాను ఆయన ప్రేక్షకులు అందరికీ నచ్చేలా రూపొందిస్తారనే నమ్మకం ఉందని, నూతన నటీనటులతో రూపొందిస్తున్న పెన్ డ్రైవ్ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. హీరో విష్ణు వంశీ మాట్లాడుతూ.. దర్శకుడు ఎంఆర్ దీపక్ చెప్పిన కథ విని చాలా ఇంప్రెస్ అయ్యానని, పెన్ డ్రైవ్ లాంటి మంచి మూవీలో హీరోగా నటించడం సంతోషంగా ఉందన్నారు. సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చానని, పెన్ డ్రైవ్ మూవీతో హీరోగా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
పెన్ డ్రైవ్ మూవీలో మంచి క్యారెక్టర్ చేస్తున్నానని, ఈ సినిమా చాలా బాగుంటుందని నటుడు ఆజాద్ అన్నారు. హీరోయిన్ రియా కపూర్ మాట్లాడుతూ.. పెన్ డ్రైవ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం హ్యాపీగా ఉందన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ దీపక్, ప్రొడ్యూసర్ రామకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు. అనంతరం నిర్మాత కె రామకృష్ణ మాట్లాడారు. మా బ్యానర్ లో పెన్ డ్రైవ్ మూవీని లాంఛనంగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
టెక్నాలజీ మనకు ఎంతగానో అందుబాటులోకి వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని దర్శకుడు ఎంఆర్ దీపక్ అన్నారు. టెక్నాలజీతో క్రైమ్స్ చేయడం సులువే కానీ తప్పించుకోవడం కష్టమన్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలనే మంచి సందేశాన్ని మా పెన్ డ్రైవ్ చిత్రంలో చెబుతున్నామని చెప్పారు. ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నాలుగు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి చేస్తామన్నారు.