Sudan Conflicts: సూడాన్ ఘర్షణలు.. దేశాన్ని విడిచిపెడుతున్న ఎనిమిది లక్షలమంది ప్రజలు
సూడాన్ మిలిటరీ చీఫ్, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చీఫ్‌ల మధ్య ఆధిపత్యం పోరుకు వందలాది మంది అమాయకులు బలైపోయారు. వేలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. గత 16 రోజుల నుంచి సైన్యానికి, పారా మిలిటరీ దళాలకు మధ్య పోరు కొనసాగుతోంది
Sudan Conflicts: సూడాన్ మిలిటరీ చీఫ్, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చీఫ్‌ల మధ్య ఆధిపత్యం పోరుకు వందలాది మంది అమాయకులు బలైపోయారు. వేలాది మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. గత 16 రోజుల నుంచి సైన్యానికి, పారా మిలిటరీ దళాలకు మధ్య పోరు కొనసాగుతోంది. ఎంతకు సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సుమారు ఎనిమిది లక్షల మంది బలవంతంగా దేశం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోవాలని చూస్తున్నారని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
ఏప్రిల్ 15 నుంచి మొదలైన అంతర్యుద్ధానికి ముగింపు లేకుండా పోయింది. రంజాన్ సందర్భంగా కాల్పులు విమరణ ఒప్పందం జరిగినా.. దాన్నిఅమలు చేసిన దాఖలాల్లేవు. దేశ రాజధాని ఖార్టూమ్ పూర్తిగా డ్యామేజీ అయ్యింది. ఆర్మీ చీఫ్, ఆర్ఎస్ఎఫ్ చీఫ్ మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో తాము బలవుతున్నామని దేశం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2021 లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి మిలిటరీ, ఆర్ఎస్ఎఫ్ హస్తగతం చేసుకున్నాయి. అప్పటి నుంచి దేశాన్ని వీరే నడుపుతున్నారు. ఇరువురు కలిసి తిరిగి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో విఫలమవుతున్నారు.
కాల్పుల విమరణ ఒప్పందం ఉల్లంఘన..(Sudan Conflicts)
ఆదివారం నాడు ఇరు దళాలు 72 గంటల పాలు కాల్పులు విరమణకు ఒప్పుకున్నాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కాల్పుల విరమణ కొనసాగించి అటు తర్వాల సౌదీ అరేబియాతో చర్చలు జరపాలని నిర్ణయించాయి. అయితే ఇరు గ్రూపులు కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సోమవారం నాడు వైమానిక దాడులు కొనసాగాయి. రాజధాని ఖార్టూమ్‌తో పాటు పొరుగున నగరాల్లో దట్టమైన పొగ కనిపించింది. ఇదిలా ఉండగా దేశ జనాభా 4.6 కోట్లు కాగా దేశం నుంచి 8 లక్షల15వేల మంది ఇతర దేశాలకు వెళ్లిపోవాలనుకుంటున్నట్లు యూఎన్ తెలిపింది. వారిలో 5 లక్షల80వేల మంది సుడానీలు కాగా.. మిగిలిన వారు విదేశీయులని యూఎన్ పేర్కొంది. ఇప్పటికే సూడాన్ నుంచి సుమారు 73 వేల మంది తరలిపోయారు. కాగా ఈజిప్టు మాత్రం తమ సరిహద్దులను దాటి సుమారు 40వేల మంది సుడానీలు వచ్చారని తెలిపింది. వీరంతా అలసి సొలసి తమ దేశంలో అడుగుపెట్టారని.. కొంత మంది చాద్, దక్షణి సుడాన్, ఇథోపియాలకు వెళ్లగా కొంత మంది ఎర్ర సముద్రం దాటి పౌదీ అరేబియాకు చేరుకున్నారని యూన్ పేర్కొంది.
సూడాన్ అంతర్యుద్ధం మొదలైన తర్వాత నుంచి 528 మంది మృతి చెందారు. సుమారు 4,599 మంది గాయపడ్డారని వైద్య ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ప్రభుత్వం చెప్పే లెక్కలకు వాస్తవానికి చాలా తేడా ఉంటుందని తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలా ఉండగా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పౌరులను ఆయా దేశాల ప్రభుత్వాలు వెనక్కి రప్పించుకున్నాయి. గత వారంలో అమెరికా తన పౌరులను సమారు 700 మంది ఖార్టూమ్ నుంచి తరలించింది. బ్రిటన్ విషయానికి వస్తే సుమారు 2,200 మందిని ఖాళీ చేయించింది. ప్రస్తుతం సుడాన్లో నిలిచిపోయిన వారు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.
పెరిగిన ధరలు.. దొంగతనాలు.. ఆహార కొరత..
ఇక స్థానికులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు కేవలం ఒకటి రెండు గంటలు పాటు షాపు తెరిచి వ్యాపారం చేసుకుని దుకాణాలు మూసుకుపోతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఒక షాపు యజమాని వాపోయాడు. సోమవారం నాడు చాలా మంది రోడ్లపైకి వచ్చి షాక్ తిన్నారు. ఇంతలోనే ఇంత దారుణం జరిగిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు. రోడ్లపైనే శవాల గుట్టలు కనిపించాయి. పారిశ్రామికవాడ పూర్తిగా లూటీకి గురైంది. దుకాణాల నుంచి టీవీలను ఎత్తుకుపోవడం.. ప్యాక్టరీల నుంచి దొంగిలించి వస్తువులను సంచుల్లో నింపుకుని పోతున్న దృశ్యాలు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. అయితే విద్యుత్, నీరు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. ఆహారం కొరత, పెట్రోల్ కొరత, ఆస్పత్రులు, క్లినిక్‌లు సేవలు నిలిపివేశాయి. రవాణా చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఐక్యరాజ్య సమితి తమ సేవలను నిలిపివేసింది. తమ ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయిందని యూఎన్ చెబుతోంది. పరిస్థితులు గాడినపడితే తిరిగి సేవలు అందిస్తామని చెబుతోంది యూఎన్.
రాజధాని ఖార్టూమ్‌లో విక్టోరియా అనే మహిళ టీ అమ్ముకొని కాలం గడిపేది. అయితే ప్రస్తుతం ఎందుకు కాల్పులు జరుపుకుంటున్నారో తమ పిల్లలకు అర్థం కావడం లేదన్నారు. రిస్క్ చేసి ఇంటి నుంచి బయటికి వెళ్లి పని చేసుకుంటేనే తన ఫుడ్ దొరుకుతుందన్నారు. ఇంట్లో కూర్చుంటే పూట గడవడం కష్టమని, భయపడితే కడపునిండదు కదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఖార్టూమ్ చెందిన మరో మహిళ జమిలా తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆహారం దొరకడం లేదు. ఒంటిపూటే తింటున్నామని, తన ఇంటి బయట ఆర్ఎస్ఎఫ్ ట్రూప్ ఉందని.. ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి అనుమతించడం లేదని ఆమె అన్నారు. రోజంతా కాల్పుల శబ్దంతో తమ చెవులు చిల్లులు పడుతున్నాయని ఆమె అన్నారు.
ప్రస్తుతం కనుచూపు మేరలో అంతర్యరుద్ధం ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ లోగా దేశం నుంచి లక్షలాది మంది పౌరులు ఇతర దేశాలకు తరలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే ఇద్దరు జనరల్స్ యుద్ధాన్ని నిలిపేసి తమ పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. తొందరగా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది