CM Chandrababu : మాది ప్రజా ప్రభుత్వం.. తణుకులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu : ఏపీని వైసీపీ పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం ముందుకెళ్తున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.
గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? అని ప్రశ్నించారు. ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విమానంలో వస్తే చెట్లను నరక్కుంటూ వచ్చేవాళ్లని ఆరోపించారు. ప్రజల సమస్యలు వినేందుకు కనీసం మాట్లాడనిచ్చేవారు కాదన్నారు. మాది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలు వినేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలన్నదే ఏకైక లక్ష్యమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చి వెళ్లిందని, అప్పు తీర్చడంతోపాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోందన్నారు. గత ముఖ్యమంత్రి కనీసం మురుగు కాల్వల్లో పూడిక కూడా తీయించలేదని పండిపడ్డారు. జగన్ 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారని, స్వచ్ఛాంధ్ర కోసం ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పేదల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచామన్నారు. దివ్యాంగులకు పింఛన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచినట్లు తెలిపారు. చరిత్రలో తొలిసారిగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర 2047 పేరుతో స్పష్టమైన విధానం తీసుకొచ్చామన్నారు. ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి
తణుకులో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ పార్కు వద్ద పారిశుధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. తణుకు కూరగాయల హోల్‌సేల్ మార్కెట్‌ను పరిశీలించారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎంకు మంత్రులు, నేతలు, అధికారులు స్వాగతం పలికారు.