Last Updated:

Manipur: మణిపూర్‌లో మళ్లీ శాంతి సాధ్యమేనా?

Manipur: మణిపూర్‌లో మళ్లీ శాంతి సాధ్యమేనా?

Manipur Violence is peace possible again: గత రెండేళ్లుగా జాతుల వైరంతో అట్టుడికిన మణిపూర్‌లో గత నెల రోజుల వ్యవధిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మణిపూర్ హింసను అడ్డుకోవటంలో విఫలమైన బీరేన్ సింగ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షం నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇదిలా ఉండగానే రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ నెల తొమ్మిదవ తేదీన తన పదవికి రాజీనామా చేయటంతో రాజకీయ సంక్షోభం ముదురుపాకాన పడింది. త్వరలోనే రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని ప్రకటిస్తారనే వార్తలు వస్తున్న క్రమంలో ఊహించని రీతిలో కేంద్రం అక్కడ గవర్నర్ పాలన విధించింది. అయితే, బీరేన్ సింగ్ రాజీనామా ఊహించని నిర్ణయం కాదని, దీని వెనక పెద్ద కసరత్తే జరిగిందని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకుడైన బీరేన్‌ సింగ్‌ 2017లో బీజేపీ తరపున సీఎంగా ఎన్నికయ్యారు. సంకీర్ణ పక్షమైన నాగాలకు చెందిన ఎన్‌పీఎఫ్‌ తోడ్పాటుతో 2022 ఎన్నికలలోనూ ఆయన గెలిచారు. రాష్ట్రాభివృద్ధికి, అక్కడ మెజారిటీ ప్రజలైన మైతీల వికాసానికి కృషి చేశారు. అభివృద్ధి పరంగానూ మణిపూర్ ముందడుగు వేసింది. ఈ పురోగతి మరింత ముందుకు సాగటానికి బీజేపీ నాయకత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కారు మేలు చేస్తుందని అందరూ విశ్వసించారు. కానీ, 2023లో సంభవించిన హింసాత్మక ఘటనలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. దీంతో మణిపూర్‌ హింసకు బాధ్యత వహిస్తూ 2023 జూన్‌లోనే సీఎం బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా పత్రం ఇచ్చే క్రమంలో వందల సంఖ్యలో మైతీ నేతలు ఆయనను అడ్డుకున్నారు. మైతీ వర్గానికి చెందిన బీరేన్ సింగ్ పదవి నుంచి తప్పుకుంటే, కుకీలు చెలరేగిపోతారని, దీంతో తమ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడుతుందని అప్పట్లో వారు వ్యాఖ్యానించారు. దీంతో వారి ఒత్తిడి మేరకు బీరేన్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో కుకీలతో జాతిపరమైన బంధం కలిగిన మిజోలు ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నిరసన చేపడతారనే నివేదికలు రావటంతో మోదీ తన మిజోరాం ప్రచారసభలను రద్దుచేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలైన ఎన్‌పీఎఫ్, ఎన్‌డీపీపీ, ఎంపీపీ మణిపుర్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో కీలక స్థానాలను నష్టపోయాయి.

రోజుకో రీతిగా అక్కడి పరిస్థితులు మారుతున్నా.. ప్రభుత్వం మీద బీరేన్ సింగ్ పట్టుసాధించలేకపోవటంతో రాష్ట్ర బీజేపీ పార్టీ రెండుగా చీలింది. క్రమంగా అక్కడి బీజేపీ నేతలు బీరేన్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు. సొంతపార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోవటంతో కేబినెట్ రెండుగా చీలిపోయింది. దీనికి తోడు మణిపూర్ విభజన అనే అంశం కూడా తెరమీదికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని కొందరు నేతలు తాముండే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కుకీల డిమాండ్‌ను సమర్థించగా, మరో వర్గం మణిపూర్‌ సమగ్రత కాపాడాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. దీనికి తోడు, ఈ నెల 10న జరిగే అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ బీరేన్ సింగ్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించటంతో.. బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. అధిష్ఠానం సూచనల మేరకు కొందరు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ స్పీకర్‌ సత్యబ్రతసింగ్‌ ఈ నెల 9వ తేదీనే ఇంఫాల్‌ హోటల్‌లో సమావేశమయ్యారు. అందులోనే బీరేన్ రాజీనామా, అసెంబ్లీ సమావేశాలను గవర్నర్‌ రద్దుచేయటం వంటి నిర్ణయాలు జరిగాయి.

బీరేన్ రాజీనామాకు మరో కీలక అంశమూ కారణమేననే వార్త వినిపిస్తోంది. గతంలో మణిపూర్ హింస జరిగిన కాలంలో ముఖ్యమంత్రి.. మైతీలకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులను ఆదేశించారనే ఆరోపణులు బలంగా వినిపించాయి. అయితే, వాటిని బీరేన్ సింగ్, బీజేపీ నేతలు కొట్టిపారేశారు. అయితే, అనూహ్యంగా ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా విడుదలైన కొన్ని ఆడియో టేపులు మణిపూర్‌లో సీఎం.. మైతీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే వాదనకు బలం చేకూర్చాయి. ‘మైతీలను ఆయుధాలు దోచుకోనివ్వండి, లూటీలు చేయనివ్వండి’అంటూ పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా ఆ ఆడియో టేపుల్లో ఉంది. ఈ టేపులను కుకీ హ్యూమన్‌రైట్స్‌ ఆర్గనైజేషన్‌ (కోహుర్) సంస్థ ప్రతినిధులు కేంద్రానికి, పలు కమిటీలకు సమర్పించినా ఏ ఫలితమూ లేకపోవటంతో .. చివరకు కోహుర్ సంస్థ ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ టేపులపై సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో టేపుల్లో బీరేన్‌ గొంతు 93శాతం సరిపోలిందని ట్రూత్‌ ల్యాబ్స్‌ నిర్థారించింది. అయితే, ట్రూత్ ల్యాబ్స్ అనేది ప్రైవేటు సంస్థ కనుక, ఈ టేపుల సంగతి తేల్చేపనిని.. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్‌)కి ఇచ్చి పరీక్ష పరీక్షచేయించాలని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేయటంతో కోర్టు కొంత సమయం ఇచ్చింది. ఈ విషయంలో కోర్టు మరుసటి దావా తేదీ లోపే బీరేన్ రాజీనామా చేయటం, రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించటం జరిగిపోయాయి. అయితే, సీఎఫ్ఎస్ఎల్ చేపట్టిన ఆడియో టేపుల విచారణలోనూ అది బీరేన్ సింగ్ గొంతేనని నిర్ధారణ అయిందని, అదే మాట సుప్రీంకోర్టు ప్రకటిస్తే, బీరేన్‌ను ఎలాగూ తప్పించాలి గనుక.. తామే ఆయన చేత రాజీనామా చేయించి, సాగనంపితే పార్టీ పరువు కొంతైనా నిలబడుతుందని, ఈ చర్యతో కుకీలు ఏదో మేరకు సంతోషిస్తారని బీజేపీ అధిష్ఠానం భావించినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, మణిపూర్‌లో అశాంతికి కొన్ని బయటి శక్తులూ బలంగా పనిచేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మణిపూర్ హింసాకాండలో విదేశీ ఏజెన్సీల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని గతంలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. మణిపూర్ హింసలో వివిధ తిరుగుబాటు గ్రూపులకు చైనీస్ సహాయం పొందడం అనే వాస్తవాన్ని కూడా ఆర్మీ మాజీ చీఫ్ నొక్కి చెప్పాడు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో నేషనల్ సెక్యూరిటీ పెర్స్పెక్టివ్ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మణిపూర్ హింసకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల ప్రమేయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ సరిహద్దు కలిపే ప్రాంతం మణిపూర్ సరిహద్దుకు దగ్గరగా ఉందని ఆయన గుర్తుచేశారు. అలాగే, మణిపూర్‌తో సరిహద్దును పంచుకుంటున్న బర్మాలో సాగుతున్న అంతర్యుద్ధం.. ఇక్కడ ఉద్రికత్తలకు కొంత కారణంగా ఉందనే మాట కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

మణిపూర్‌లో 2023 మే 3వ తేదీన మొదలైన జాతుల వైరం కారణంగా నేటికీ అడపాదడపా అక్కడ చెదురుమదురు హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మణిపూర్‌లో అల్లర్లు చెలరేగినప్పుడల్లా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడమే తప్ప కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని శాంతిభధ్రతలను కాపాడలేకపోయారనే విమర్శలు అటు కేంద్రం మీద.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇన్నాళ్లుగా గట్టిగా వినిపిస్తూ వస్తున్నాయి. గడచిన 22 నెలల్లో సంభవించిన హింసాత్మక ఘటనల కారణంగా నేటికీ సుమారు 60వేల మంది తమ స్వస్థలాలకు వెళ్లలేక, సహాయ శిబిరాల్లోనే గడుపుతున్నారు. రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, నేటికీ మైతీలు, కుకీలు.. పొరుగు తెగ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో అడుగుపెట్టే సాహసం చేయలేకపోతున్నారు. ఈ అనిశ్చితి పరిస్థితిలో అక్కడి ప్రజల వృత్తి ఉపాధులన్నీ దెబ్బతిని జనం ఆర్థికంగా కుదేలైపోతున్నారు. అక్కడి ప్రజల మధ్య మానసిక అనుబంధం తెగిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల మధ్య శాంతి, సమరసతలను పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.