Last Updated:

India vs England: అభిషేక్ ఊచకోత.. అఖరి టీ20లోనూ భారత్ ఘన విజయం

India vs England: అభిషేక్ ఊచకోత.. అఖరి టీ20లోనూ భారత్ ఘన విజయం

India vs England 5th 20 match India thrashes England by 150 runs: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆరంభం నుంచే చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్(16) త్వరగా పెవిలియన్ చేరగా.. అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 54 బంతుల్లో 134 పరుగులు చేయగా.. ఇందులో 7 ఫోర్లు, 13 సిక్స్‌లు కొట్టాడు.

భారత్ బ్యాటర్లలో తిలక్(24), దూబె(30) పరుగులతో రాణించగా.. సూర్య(2), హార్దిక్(9), రింకు సింగ్(9) విఫలమయ్యారు. అయితే చివరి రెండు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే లభించాయి. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్ 3 వికెట్లు పడగొట్టగా.. వుడ్ 2 వికెట్లు, ఆర్చర్, ఓవర్టన్, రషీద్ తలో వికెట్ తీశారు.

భారత్ విధించిన భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బోల్తాపడింది. ఆ జట్టు బ్యాటర్లలో సాల్ట్(55) మినహా మిగతా వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. షమీ, వరుణ్ చక్రవర్తి ధాటికి ఇంగ్లండ్.. 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్‌(0), బట్లర్‌(7), బ్రూక్‌(2), లివింగ్‌స్టన్‌(9), బెతెల్‌(10), కార్స్‌(3), ఓవర్టన్‌(1) విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, అభిషేక్, దూబె తలో 2 వికెట్లు, బిష్ణోయ్ ఒక్క వికెట్ తీశారు.