India- England Test Series: నేటి నుంచే భారత్- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్

Test Series 1st Match: ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు ఇంగ్లాండ్, భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. యువ కెప్టెన్ శుభ్ మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగబోతోంది. కాగా ఇంగ్లాండ్ లో భారత్ టెస్ట్ సిరీస్ గెలిచి 18 ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ గెలవడం భారత్ కు సవాల్ గా మారింది. దశాబ్దాలుగా ఇంగ్లాండ్ గడ్డపై పర్యటిస్తున్నా.. అక్కడ మూడుసార్లు మాత్రమే భారత్ టెస్ట్ సిరీస్ గెలిచింది. హెడింగ్లీ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
బ్యాటింగ్ లో భారత్ కు పెద్దగా అనుభవం లేదు. సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ లో ఒక్క టెస్ట్ ఆడలేదు. మరోవైపు శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ లో కొన్ని మంచి ఇన్నింగ్స్ లు ఆడినా గొప్ప రికార్డ్ మాత్రం లేదు. ఈ నేపథ్యంలో మన బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి. జైస్వాల్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. సుదర్శన్ మూడో స్థానంలో దిగవచ్చు. ఇక కరుణ్ నాయర్ ఆరో స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఏకైన స్పిన్నర్ గా జడేజా తుది జట్టులో ఉంటాడు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ పోటీలో నితీశ్ రెడ్డి, శార్దూల్ మధ్య పోటీ ఉన్నా.. మన తెలుగు ఆటగాడికే అవకాశం దక్కొచ్చు. బౌలింగ్ లో భారత్ కు బుమ్రా కీలకం. బుమ్రాకు తోడుగా సిరాజ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ మూడో బౌలర్ గా ఆడే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు బ్యాటింగ్ లో బలంగా ఉన్న ఇంగ్లాండ్… బజ్ బాల్ ఆటతో ప్రత్యర్థిని ఇరుకున పెట్టాలని చూస్తోంది. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్ బ్యాటింగ్ లైనప్ ఫిట్ గా ఉంది. ఇక పేస్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ తడబడుతోంది. మార్క్ వుడ్ గాయంతో దూరం కాగా.. జోఫ్రా ఆర్చర్ రెండో టెస్ట్ కు అందుబాటులో ఉంటాడు. వోక్స్, కార్సీ, జోష్ టంగ్, స్టోక్స్ పేస్ బౌలింగ్ చేస్తారు.
తుది జట్లు:
ఇండియా: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్: క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, హారీ బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్, వోక్స్, బ్రైడన్ కార్సీ, జోష్ టంగ్, బషీర్