ముదిరిన పఠాన్ “బేషారం” వివాదం… భవిష్యత్తులో నగ్నంగా చూపిస్తారేమో అంటున్న “శక్తిమాన్”
Besharam Song Issue : సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ” పఠాన్ “. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా… జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నుంచి ” బేషరం రంగ్ ” అనే పాటను మూవీ యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. అయితే ఇందులో దీపికా ధరించిన దుస్తులు, కొన్ని సీన్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఈపాటలో అశ్లీలత ఎక్కువైందని… అసభ్యకమరైన సీన్స్ ఉన్నాయని, వాటిని మార్చకపోతే సినిమాను నిషేదిస్తామంటూ భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు కూడా ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోల్ కతా వేదికగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న షారుఖ్ ఖాన్ తన వ్యాఖ్యలతో ఈ వివాదాన్ని మరింత పెంచారు. సోషల్ మీడియా కారణంగానే నెగిటివిటీ ఎక్కువగా పెరుగుతుందని, అదే మనుషుల మధ్య విభేదాలను సృష్టించి నాశనం చేస్తుందని అన్నారు. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆ పాటపై ట్రోలింగ్స్ మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా భాజపా నేతలంతా ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ కోరుతున్నారు.
అయితే తాజాగా ఈ సాంగ్ వివాదంపై శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ పాట చూసేందుకు చాలా అసభ్యకరంగా ఉందని అన్నారు. ఇతరుల ఫీలింగ్స్ ను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ఆయన ప్రశ్నించారు. అలానే బాలీవుడ్ సినీ పరిశ్రమ గాడి తప్పిందని… అశ్లీలత ఎక్కువైందని చెప్పారు. పొట్టి దుస్తులలో నటీనటుల్ని చూపించిన ఫిల్మ్ మేకర్స్… భవిష్యత్తులో వాళ్లను నగ్నంగా చూపించే ఆస్కారం ఉందని ఫైర్ అయ్యారు.
ఇలాంటి వాటిని అంగీకరించడానికి మన దేశమేమీ స్పెయిన్, స్వీడన్ కాదు. ఏ ఒక్కరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలకు ఇబ్బంది కలగకుండా సినిమాలు ఉండేలా చూసుకోవడం సెన్సార్ బోర్డ్ పని అని ఘాటుగా వ్యాఖ్యానించారు. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు సెన్సార్ అనుమతివ్వకూడదు. ఇతరుల ఉద్దేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఇలాంటి వస్త్రధారణను ఎలా అంగీకరించారు? అంటూ ముఖేష్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ వివాదానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.