Kakinada: ఏడు కుటుంబాలను వెలివేసిన గ్రామపెద్దలు.. అసలేం జరిగిందంటే?
Seven Families Banished From kakinada uppumilli Village issue: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని ఉప్పుమిల్లి గ్రామంలో ఏకంగా ఏడు కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారు. అయితే ఆ ఏడు కుటుంబాలను ఎందుకు వెలివేశారు? ఆ గ్రామం నుంచి బహిష్కరించేందుకు ఆ కుటుంబం చేసిన పని ఏంటి? మరి బాధితుల ఆవేదన ఏంటి? గ్రామ పెద్దలు ఎలాంటి కారణాలు చెప్పారు? ఇరు వర్గాల మధ్య జరిగిన సమావేశంలో అధికారులు ఎలాంటి సూచనలు ఇచ్చారు? ప్రస్తుతం ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
ప్రపంచమంతా అభివృద్ధిలో దూసుకెళ్తున్నా.. కొన్నిచోట్ల ప్రజలు ఇప్పటికీ మూఢనమ్మకాల నుంచి బయట పడలేకపోతున్నారు. టెక్నాలజీ యుగంలోనూ కొంతమంది మనుషులు మూఢచారాలను మరచిపోలేకపోతున్నారు. దీంతో అక్కడక్కడ దారుణమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఏపీలోని కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో ఏడు కుటుంబాలను గ్రామపెద్దలు వెలివేశారు. వివాహ, శుభకార్యాలు, పనులకు సైతం పిలవకుండా ఉండడంతో పాటు వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే.. వారికి రూ.5వేల చొప్పున జరిమానా విధించాలని గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ధాన్యం నగదు విషయంలో తలెత్తిన వివాదంతో పాటు రాజకీయ పార్టీల మద్దతు విషయంలో చోటుచేసుకున్న ఘటనలతో ఆ ఏడు కుటుంబాలను వెలివేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందనలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుడు మేడిశెట్టి దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ స్పందించాడు.
ఈ మేరకు కాజులూరు తహసీల్దార్, గొల్లపాలెం ఎస్ఐ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య రాజీ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తులను దూరంగా ఉండాలని, మీకు మేము కూడా దూరంగా ఉంటామని చెప్పడం చట్టరీత్యా నేరమవుతుందని అధికారులు చెప్పారు. అలాగే అభిప్రాయాల భేదాలు, వ్యక్తుల ప్రవర్తన, నచ్చని వ్యక్తులు ఉంటారని మనం ఇతరులను దూరం పెట్టే అధికారం లేదని స్పష్టం చేశారు.