Balakrishna : దామోదర రాజనరసింహ పేరుతో సినిమా చేయాలని ఉంది : బాలకృష్ణ

Basavatarakam Cancer Hospital 25th Anniversary Celebration : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశం, లేక లాభాలు పొందాలనే ఆశతో ఆసుపత్రిని ప్రారంభించలేదని చెప్పారు. తనకు దామోదర రాజనరసింహ పేరుతో సినిమా చేయాలని ఉందని పేర్కొన్నారు.
వ్యక్తిగత నష్టం వల్ల కలిగిన ఆలోచన నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పుట్టిందని చెప్పారు. తన అమ్మ క్యాన్సర్‌తో మృతి చెందడంతో అందరికీ చికిత్స అందించాలని తన నాన్న ఎన్టీఆర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారన్నారు. 110 పడకలతో మొదలైన ఆసుపత్రి.. నేడు దేశంలోనే అత్యున్నత ఆసుపత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. త్వరలో 1000 పడకలతో అమరావతిలో క్యాన్సర్ వైద్యశాల ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశలో 300 పడకలతో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తమకు అన్నివిధాలుగా సహకారం అందిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. బాలకృష్ణ దాతృత్వం కలిగిన నటుడు, నేత అన్నారు. అందరికీ మంచి వైద్యం అందించాలనేదే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి లక్ష్యమన్నారు. రానున్న రోజుల్లో పేదలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఏటా 50 నుంచి 55 వేల మంది క్యాన్సర్ బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎన్‌జే, బసవతారకం ఆసుపత్రులతోపాటు జిల్లాల్లో క్యాన్సర్ చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో నలుదిశలా వైద్య సేవలు అందించేందుకు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.