CJI Chandrachud: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
CJI Chandrachud: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ చంద్రచూడ్ కు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సీజేఐని ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్ర చూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.
అర్చకులు ఆయనను శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం అందజేశారు. అనంతరం సిజెఐకి చైర్మన్, ఈవో స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్ర చూడ్ దంపతులు ఆలయంలో నిర్వహించిన గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవు, దూడకు పూజలు చేసి పశుగ్రాసం తినిపించారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కుటుంబంతో పాటు జిల్లా జడ్జి వీర్రాజు, టీటీడీ సివిఎస్వో నరసింహ కిషోర్, ఆర్డీవో కనక నరసారెడ్డి , డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజివో మనోహర్, అదనపు ఎస్పీ కులశేఖర్, డిఎస్పీ నరసప్ప , ఆలయ ప్రధాన అర్చకులు పార్థ సారధి, బాలాజి రంగాచార్యులు ఆలయ సూపరింటెండెంట్ ముని చంగలరాయులు పాల్గొన్నారు. రాత్రి అక్కడే బస చేసి, గురువారం సాయంత్రం 5.40 తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడకు వెళ్లనున్నారు.
జస్టిస్ చంద్రచూడ్ సుప్రీం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రావడం ఇదే మొదటిసారి. సుప్రీం కోర్టుకు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం చంద్రచూడ్ వ్యహరిస్తున్నారు.
ఇదీ చదవండి: అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాల్లో తిరుమలది రెండవ స్థానం.. మరి ఫస్ట్ ప్లేస్ ఏ దేవాలయానికంటే..?