Anam Ramanarayana Reddy : మా మీద ప్రజలకు నమ్మకం లేదు… నాలుగేళ్లలో మనం చేసిందేంటి? ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై అధికార పార్టీకి చెందిన వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Anam Ramanarayana Reddy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై అధికార పార్టీకి చెందిన వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు. రోడ్లగుంతలు పూడ్చలేకపోతున్నాం అని పేర్కొన్న ఆయన తాగడానికి నీళ్లు లేవు అంటే కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కింద నిధులు ఇస్తుంది, అప్పుడు నీళ్లు ఇస్తామని చెప్పుకోవాల్సి వస్తోందని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని, ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడగాలి అని ఆనం ప్రశ్నించారు.
ప్రాజెక్టులు ఏమన్నా కట్టామా? పనులు మొదలుపెట్టామా? శంకుస్థాపనలు ఏమైనా చేశామా? అని ఆయన ప్రశ్నించినట్టు చెబుతున్నారు. పెన్షన్ ఇస్తే ఓట్లు వేసేస్తారా? అలా అనుకుంటే గత ప్రభుత్వమూ పెన్షన్ ఇచ్చింది.. ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. పేదలకు ఇళ్ళు కట్టిస్తామని చెప్పాం అలాగే లేఔట్ లు వేశామేగానీ ఇళ్లు కట్టామా? అని ప్రశ్నించారు. ఇక గతంలో కూడా ఇలా వైసీపీ ప్రభుత్వం మీద ఆనం అనేక మార్లు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారు అని ప్రచారం జరిగింది.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కీలకమైన ఆర్దికశాఖను నిర్వహించి నెల్లూరు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఆనం వైసీపీ అధికారంలోకి వచ్చాక డమ్మీ అయిపోయారు. నెల్లూరు నుంచి మొదటి విడత అనిల్ కుమార్ యాదవ్ కు, రెండవ విడత కాకాణి గోవర్దన్ రెడ్డి కి మంత్రిపదవులు దక్కగా ఆనంకు సీఎం జగన్ మొండి చేయే చూపారు. పేరుకు ఎమ్మెల్యే అయినా చేయడానికి పనులు, నిధులు లేకపోవడంతో ఆయన చాలాకాలంగా అసహనంగా ఉన్నారు.