ఏపీ: తెనాలిలో అన్న క్యాంటీన్ కు నిప్పంటించిన దుండగులు.. ఎందుకంటే..?
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. మాచర్ల ఘటన మరువకముందే మరో ఘటన.
Tenali: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. శనివారం అర్ధరాత్రి క్యాంటీన్ వద్దకు చేరుకున్న దుండగులు తలుపులకు నిప్పంటించి పరారయ్యారు. ఎగిసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.
నిప్పు పెట్టిన అన్న క్యాంటిన్ ని టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను దహనం చేయటం దుర్మార్గం అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం, వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చకపోగా చేసే వారికి అడ్డు తగలడం దారుణం అని అన్నారు. ప్రశాంత వాతావరణలో ఉండే తెనాలిలో ఇలాంటి దుశ్చర్యలు చోటు చేసుకోవడం బాధాకరం అని వాపోయారు. అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టిన దుండగులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో తెనాలి పట్టణంలో కూడా అన్న క్యాంటిన్ ను ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని అన్న క్యాంటీన్ల మాదిరిగానే ఇదికూడా మూతపడింది.