MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో మరో సమరం.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఏపీలో 5, తెలంగాణలో 5 మొత్తం 10
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈసీ సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 10వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనున్నది. ఈ నెల 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నది.
ఏపీ, తెలంగాణలో..
తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్, ఏపీలో బీటీ నాయుడు, అశోక్‌బాబు, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు పదవీకాలం ఈ నెల 29వ తేదీన పూర్తి కానున్నది.
కాంగ్రెస్‌కు 4, కూటమికి 5
శాసనసభలో పార్టీలకు ఉన్న సంఖ్యా బలాన్ని చూస్తే తెలంగాణలో హస్తం పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు, కారు పార్టీకి
ఒక సీటు దక్కే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఇందులో టీడీపీకి మూడు, జనసేన, బీజేపీకి ఒక్కొక్కటి దక్కే అవకాశం ఉంది.
అభ్యర్థులపై కసరత్తు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోనూ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ దక్కితే చాలు. గెలుపు ఖాయం కానున్న నేపథ్యంలో టికెట్ దక్కించుకోబోయే అదృష్టవంతులు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది.మరో వైపు తమకు ఉన్న సంఖ్యా బలం రీత్యా ఒక అభ్యర్థిని గెలిపించుకోగల బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని సైతం బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నాగాబాబుకు మంత్రి పదవి?
జనసేన పార్టీ నుంచి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాన్ అన్న నాగబాబుకు ఖరారు కానుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ సీటును వదులుకున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబును రాజ్యసభకు పంపాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసింది.
కానీ, ఆయన కేబినెట్లో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేయడంతో ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లో తీసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.