Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి పేరిట అరుదైన రికార్డు.. ఆడిన రెండో మ్యాచ్‌లోనే!

Varun Chakravarthy’s 5-wicketS Record: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టాప్ ప్లేస్‌లో ఉంది. తాజాగా, దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో చక్రం తిప్పాడు. 10 ఓవర్లలో 4.20 రన్‌రేట్‌తో 42 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుణ్ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. తన కెరీర్లో రెండో మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గా రికార్డుకెక్కారు. అంతకుముందు 2014లో స్టువర్ట్ బిన్నీ తన మూడో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌తో బిన్నీ రికార్డును వరుణ్ అధిగమించాడు.
250 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్.. భారత స్పిన్నర్ల దెబ్బకు 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు 9 వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 2004లో కెన్యాపై పాకిస్థాన్ స్పిన్నర్లు 8 వికెట్లు పడగొట్టారు.