India vs Australia: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఘోర ఓటమి
India vs Australia fourth match india all out: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 340 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్.. 155 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 184 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2-1తో ముందంజలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(84)పరుగులతో రాణించగా.. రిషబ్ పంత్(30) పర్వాలేదనిపించాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం చెందారు.
అంతకుముందు, ఐదో రోజు బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది. నాలుగో రోజు 9 వికెట్లకు 228 పరుగులు చేసిన ఆసీస్.. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే లయన్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. బుమ్రా చివరి వికెట్ తీయడంతో ఆసీస్ ఆలౌటైంది. భారత్ ముందు 340 పరుగుల లక్ష్యం ఉంచింది.
అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి ఐదు ఓవర్లలో భారత్ 5 పరుగులు చేసింది. భారత్ నిలకడగా ఆడుతున్న సమయంలో కమిన్స్ దెబ్బతీశాడు. కమిన్స్ వేసిన బంతిని రోహిత్ శర్మ(9) షార్ట్ ఆడబోయి మార్ష్ చేతికి చిక్కాడు. దీంతో 25 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత వన్ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన రాహుల్(0) డకౌట్ అయ్యాడు. కమిన్స్ వేసిన అదే ఓవర్లలో చివరి బంతికి రాహుల్‌ను పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ రెండు వికెట్ల కోల్పోయింది. దీంతో భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు విరాట్ తో పాటు యశస్వీ జైస్వాల్ ప్రయత్నించారు. కానీ, లంచ్ బ్రేక్‌కు ముందు, స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ(5) స్లిప్‌లో దొరికిపోయాడు.
స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు రిషభ్ పంత్, జైస్వాల్ ప్రయత్నించారు. కుదరుగా ఆడుతున్న రిషభ పంత్(30) ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా.. మిచెల్ మార్స్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. కాగా, వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 88 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత జడేజా(2), నితీశ్(1) ఔటయ్యారు. అయితే కాసేపటికే యశస్వీ జైస్వాల్(84) కూడా ఔట్ అయ్యాడు. దీంతో 141 పరుగుల వద్ద భారత్ 7వ వికెట్ కోల్పోయింది. ఇక, ఆకాశ్ దీప్(7), బుమ్రా(0), సిరాజ్(0) ఔట్ కావడంతో భారత్ 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు పడగొట్టగా.. స్కాట్ బోలాండ్ 3, నాథన్ లైయన్ 2, స్టార్క్, హెడ్ తలో వికెట్ తీశారు.