Published On:

Pahalgam : ఉగ్రదాడిపై మోదీ ఆరా.. దాడి వెనక పాకిస్తాన్ హస్తం

Pahalgam : ఉగ్రదాడిపై మోదీ ఆరా.. దాడి వెనక పాకిస్తాన్ హస్తం

 

Pahalgam : సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమన్నారు. విమానాశ్రయంలో మోదీని కలిసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పరిస్థితిని వివరించారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో పహల్గాం దాడిలో 26 మంది మరణించారు. మృతులకు కేంద్ర హోం మంత్రి నివాళులు అర్పించారు.

 

ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని పాలెం వైమానిక దళ స్థావరంలో దిగారు. అక్కడే విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్, అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. ఇప్పటికే ఉగ్రవాదులకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నవ వధువు
మంగళవారం మధ్యాహ్నం పహల్గాంలో టూరిస్టులు స్వేచ్చగా విహరిస్తున్నప్పుడు అనేక మంది ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. భయాందోళనకు గురైన టూరిస్టులు టెంటులలో దాక్కున్నారు. ఉగ్రవాదులు ప్రతీ టెంటులోకి వచ్చి మగవారిని పట్టుకెళ్లి తలపై తుపాకీ గురిపెట్టి కాల్చిచంపారు. తమ భర్తలను చంపవద్దని మహిళలు బ్రతిమిలాడినా కనికరం చూపలేదు. చనిపోయిన వారిలో అప్పుడే పెళ్లై హనీమూన్ కు వచ్చిన నూతన దంపతులు ఉన్నారు. భర్త మృతదేహం పక్కనే బిక్కుతోచని స్థితిలో కూర్చుండి పోయింది నవ వధువు.

 

ఉగ్రదాడి వెనక పాక్ హస్తం
పహల్గాం ఉగ్రదాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ‘ (టిఆర్‌ఎఫ్) బాధ్యత వహించింది. ఈ ఉగ్రవాద సంస్థ ఆర్టికల్ 370ని నిషేధించిన తర్వాత ఏర్పడింది. మొదట ఆన్ లైన్ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా ఆ తర్వాత లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేసింది. దాడి వెనకాల పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు నిఘావర్గాలు స్పష్టం చేశాయి.  2019లో టిఆర్‌ఎఫ్ ఏర్పాటైనప్పటినుంచి తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నించింది. అందుకు పాకిస్తాన్ సహకారం అందడంతో పహల్గాం దాడి జరిగిందని నిఘావర్గల సమాచారం.  దాడికి పాల్పడినవారిని వదలబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటికే బలగాలు కశ్మీర్ ను జల్లెడపడుతున్నాయి.