AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం
Low pressure in Bay of Bengal AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఈనెల 21న దక్షిణ అండమాన్ పై ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం 25న వాయుగుండంగా బలపడనుందని, దీనిమూలంగా మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
తీర ప్రాంతాలకే ముప్పు
నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తర్వాత 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని తెలిపారు. వర్షాలు పడే సమయంలో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షం పడే సమయంలో రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించారు.