Last Updated:

Chandrababu : ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్ష.. వారికి కీలక సూచనలు

Chandrababu : ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్ష.. వారికి కీలక సూచనలు

Chandrababu : ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర పథకాలు, ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలన్నారు.

 

 

వారిపై కఠినంగా ఉండాలి..
తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం దూబచర్లగాంధీ కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు. ఘటనపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంబేద్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.

 

 

ఘటనపై డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడారు. ఘటనపై పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. ఘటనలో కుట్ర కోణాన్ని వెలికి తీయాలని డీజీపీని ఆదేశించారు. దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎంకు డీజీపీ వివరించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా కుట్ర చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు కోరారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఇవి కూడా చదవండి: