Chandrababu: యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించాం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

PM Modi, CM Chandrababu Participate in Yoga Andhra: విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు.
యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించామన్నారు. కార్యక్రమానికి ప్రకృతి, వరుణ దేవుడు కరుణించాడన్నారు. యోగాంధ్రలో పాల్గొనేందుకు దాదాపు 3.3 లక్షల మంది వచ్చారని తెలిపారు. తొలిసారి రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించామన్నారు. ఏపీవ్యాప్తంగా యోగాంధ్ర కోసం 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 25 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అనుకున్నామని, ఇప్పుడు 1.80 కోట్ల మందికి సరిఫికెట్లు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రధాని మోదీ ప్రమోట్ చేశారని, యోగా గేమ్ ఛేంజర్ అన్నారు. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హుద్‌హుద్ సమయంలో తమ కృషిని విశాఖ ప్రజలు గుర్తుపెట్టుకున్నారని తెలిపారు.
ఆరోగ్య రంగానికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని వివరించారు. ఏఐ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తీసుకురాబోతున్నామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు ఎకనమిక్ కారిడార్ తీసుకొస్తామన్నారు. తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనమిక్ కారిడార్, అమరావతి కేంద్రంగా మరో ఎకనమిక్ కారిడార్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఏడాది పాలనలో 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు సృష్టించామన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీకి అనుగుణంగా పని చేస్తున్నామన్నారు.
యోగా నేచురోపతి, ఆయుర్వేదం మన వారసత్వ సంపద అన్నారు. సంపదను ప్రధాని మోదీ వెలికితీశారని కొనియాడారు. ప్రజలు ఆర్గానిక్ వైపు వెళ్తే, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెలిపారు.